Emerging Asia Cup 2023 | ఒకవైపు సీనియర్ జట్టు కరీబియన్ దీవుల్లో దుమ్మురేపుతుంటే.. మరోవైపు యువ భారత జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో విజృంభిస్తున్నది. టోర్నీలో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న యంగ్‌ఇండియా.. సెమీఫైనల్లో బంగ్లాపై గెలిచితుదిపోరుకు అర్హత సాధించింది.
కొలంబో: యష్ ధుల్ (66) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడపడంతో ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యంగ్‌ఇండియా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-‘ఎ’ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-‘ఎ’ 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌ల్లో దంచికొట్టిన ఓపెనర్లు సాయి సుదర్శన్ (21), అభిషేక్ శర్మ (34) ఓ మోస్తరుగా ఆడగా..రియాన్ పరాగ్ (12), ధ్రువ్ జురేల్ (1) విఫలమయ్యారు.
సహచరుల నుంచి సహకారం లభించని చోట యష్‌ధుల్ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. తన్జిద్ హసన్ (51) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 5, మానవ్ 3 వికెట్లు పడగొట్టారు. మరో సెమీస్‌లో శ్రీలంకపై 60 పరుగుల తేడాతో నెగ్గిన పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్లో తలపడనుంది.