IND A vs AUS A : ఇంగ్లండ్ పర్యటనలో చెలరేగిన అమ్మాయిలు ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం తడబడుతున్నారు. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వగా భారత ఏ జట్టు 73కే ఆలౌటయ్యింది. ఆస్ట్రేలియా ఏ బౌలర్ల ధాటికి నిలువలేక 144 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ రాధా యాదవ్ (Radha Yadav)లు నిరాశపరచగా.. వ్రిందా దినేశ్(21), మిన్ను మణి(20)లు పోరాడినా భారీ ఓటమిని తప్పించలేకపోయారు. ఓపెనర్ల విధ్వంసానికి కిమ్ గార్త్ (4-7) సంచలన బౌలింగ్ తోడవ్వడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
సిరీస్ సమం చేయాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు పంజా విసరలేకపోయారు. ప్రత్యర్థికి భారీ స్కోర్ సమర్పించుకొని.. ఒత్తిడికి లోనై వరుసగా డగౌట్ చేరారు. కిమ్ గార్త్ (4-7) అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 రన్స్ కొట్టింది. ఓపెనర్లు తహ్లియా విల్సన్(43), అలీసా హేలీ(70)లు తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. ఆ తర్వాత కౌర్‌నే వెబ్(26 నాటౌట్), కెప్టెన్ నికొలీ ఫాల్టమ్ (8) ధనాధన్ ఆడగా ఆసీస్ ఏ జట్టు భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Healy leads the charge ⚡
The opener hammered 70 off 44, powering Australia A to 187/4. India A now staring at a big chase to keep the series alive.#AUSAvINDA pic.twitter.com/iQefZ04sJ5
— FanCode (@FanCode) August 9, 2025
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత ఏ జట్టుకు ఆదిలోనే షాకిచ్చింది కిమ్ గార్త్. డేంజరస్ ఓపెనర్ షఫాలీని ఔట్ చేసి ఒత్తిడిలో పడేసింది. ఉమా ఛెత్రీ సున్నాకే పెవిలియన్ చేరగా.. వ్రిందా దినేశ్ (21) కాసేపు పోరాడింది. కానీ.. ఆమెకు సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. గార్త్ జోరుకు మిడిలార్డర్ చేతులెత్తేయగా 15.1 ఓవర్ వద్ద 73 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం జరుగనుంది.