Ind vs WI | అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పట్టు బిగించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టును కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. దీంతో భారత్ 270 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఈ ఆధిక్యంతో భారత్ ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ విధించింది. ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. చూస్తుంటే రేపటితో రెండో టెస్ట్‌కి తెరపడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు స్పిన్నర్స్ విజృంభిస్తే మాత్రం నేడే రెండో టెస్ట్ ముగియడం ఖాయం.
మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే కుల్దీప్ యాదవ్ తన స్పిన్ తో విండీస్ బౌలర్స్‌కి చుక్కలు చూపించాడు. తన తొలి స్పెల్‌లోనే షాయ్ హోప్ (36), ఇంలాచ్, గ్రీవ్స్లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు. కుల్దీప్ అద్భుతమైన స్పిన్‌తో బ్యాటర్లు తడబడ్డారు. మొత్తం 5 వికెట్లు (5/82) తీసుకొని కుల్దీప్ టెస్ట్ క్రికెట్లో మరోసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసుకున్నాడు. కుల్దీప్కి రవీంద్ర జడేజా కూడా తోడయ్యాడు. జడేజా 3 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూల్చడంలో భాగమయ్యాడు. అలాగే మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసి టెయిలెండర్స్ని కట్టడి చేశారు.
9వ వికెట్‌కు ఖారీ పియరీ (23), అండర్సన్ ఫిలిప్ కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. చివర్లో జైడెన్ సీల్స్ – ఫిలిప్ కాంబో 27 పరుగులు జోడించి భారత్‌ను కొంత విసిగించారు . కానీ చివరకు కుల్దీప్ మరో వికెట్ తీసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకోగా, యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరు సాధించడంలో భాగమయ్యాడు. ఏదేమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. కుల్దీప్ బౌలింగ్ ఈ విజయంలో కీలకంగా మారింది. ప్రస్తుతం ఫాలోఆన్‌లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ మరోసారి తక్కువ స్కోరుకే చాప చుట్టే అవకాశాలున్నాయి.