బెంగళూరులో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని లంక పేసర్ సురంగ లక్మల్ ప్రకటించాడు. భారత్లో ఆడే సిరీస్ తనకు ఆఖరిదని సిరీస్ ప్రారంభానికి ముందే లక్మల్ ప్రకటించాడు. ఈ క్రమంలో తన నిర్ణయంపై మాట్లాడిన లక్మల్.. రిటైర్ అవడానికి ఇదే సరైన సమయం అని తను భావిస్తున్నట్లు చెప్పాడు.
కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసమే తను జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ‘‘నా ప్రదర్శన కన్నా జట్టు కోసం ఏం చేయగలననే దాని గురించే ఎక్కువ ఆలోచించా. పదమూడేళ్ల పాటు క్రికెట్ ఆడాను. ఇప్పుడు నా వయసు 35. ఇంకొన్ని సంవత్సరాలు జట్టుతో ఉండే బదులు.. నా స్థానాన్ని ఎవరైనా యువ ఆటగాడికి ఇస్తే మంచిదని అనిపించింది. శ్రీలంక క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే బెస్ట్ టైం’’ అని లక్మల్ పేర్కొన్నాడు.
శ్రీలంక జట్టు తరఫున 69 అంతర్జాతీయ టెస్టు మ్యాచులు ఆడిన లక్మల్.. 36.37 యావరేజితో 170 వికెట్లు తీశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతని ఎకానమీ కూడా 3.01 మాత్రమే. ఇక వన్డేలు, టీ20లు కలిపి లంక తరఫున 97 మ్యాచులు ఆడిన ఈ పేసర్.. 117 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.