ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథుమ్ నిస్సంక (75) మాత్రం భారత బౌలింగ్ దళానికి ఎదురు నిలిచాడు. అతనితోపాటు చివర్లో దాసున్ షానక (47 నాటౌట్) రాణించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 183/5 పరుగులు చేసింది.
లంక బ్యాటర్లలో నిస్సంక హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దనుష్క గుణతిలక (38), చరిత్ ఆసలంక (2), కమిల్ మిషార (1), దినేష్ చండిమాల్ (9) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ అందరూ తలో వికెట్ తీశారు. భారత జట్టు ముందు 184 పరుగుల లక్ష్యం ఉంది.