ఐపీఎల్లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా పట్టుదలగా ఆడి, చివరకు టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు మధ్యప్రదేశ్ కుర్రాడు రజత్ పటీదార్. ఈ ఏడాది ఐపీఎల్లో ఒక్క ఫ్రాంచైజీ కూడా అతని గురించి పట్టించుకోలేదు. ఒక్కరు కూడా వేలంలో అతన్ని కొనుక్కోలేదు.
చివర్లో లువ్నిత్ సిసోడియాకు గాయం అవడంతో అతని స్థానంలో రజత్‌ను తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం. అప్పటికీ టోర్నీ సగంలోనే అతనికి ఆడే అవకాశం దొరికింది. తనకు దక్కిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న పటీదార్.. ఎలిమినేటర్‌లో అద్భుతమైన సెంచరీతో రాణించాడు.
తర్వాత రంజీల్లో కూడా సూపర్ ఫామ్ కనబరిచాడు. ఈ రంజీ సీజన్లో 82.85 సగటుతో 658 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే అతన్ని సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌లో ఆడే 11 మందిలో చోటు దక్కించుకోలేకపోయిన అతను.. రెండో మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రజత్‌కు టీమిండియా పిలుపు రావడం పట్ల తమకేమీ ఆశ్చర్యం లేదని తండ్రి మనోహర్ పటీదార్ అంటున్నారు. పన్నెండో తరగతి ఎలాగోలా పాసైన తమ కుమారుడు.. ఎప్పుడూ క్రికెట్ మీదనే ధ్యాస పెట్టేవాడని, అతను జట్టుకు ఎంపిక అవుతాడని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పారు. రజత్ రంజీలు ఆడటం ప్రారంభించినప్పుడే కెరీర్లో మరింత ముందుకెళ్తాడని ఊహించినట్లు మనోహర్ తెలిపారు.