IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ నెల 22 నుంచి గౌహతిలో రెండోటెస్టు జరుగనున్నది. అయితే, ఈ పరాజయంతో రెండురోజులు విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా జట్టు శిక్షణ తీసుకోవడంలో నిమగ్నమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు సభ్యులు పలువురు మంగళవారం ప్రాక్టీస్ చేశారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారతదేశం 0-1తో వెనుకపడింది. రెండోటెస్టును ఎలాగైనా సమయం చేసి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నది. కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో శిక్షణ పొందారు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాత్రం ప్రాక్టీస్‌లో కనిపించలేదు.
చాలామంది బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్‌లో బ్యాటింగ్ చేయగా.. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్, కోల్‌కతాకు చెందిన పలువురు బౌలింగ్ చేశారు. కోల్‌కతా టెస్ట్‌లో భారత జట్టు ఓటమిని పాలైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్లు సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్‌లపై భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. టర్నర్ పిచ్‌లతోనే దక్షిణాఫ్రికాను ఇరుకున పెట్టాలని భావించిన టీమిండియా.. అదే వ్యూహంతో బోల్తాపడింది. నెట్ సెషన్లో సాయి సుదర్శన్, జురెల్ స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఇద్దరూ ప్యాడ్లు ధరించి ముమ్మరంగా సాధన చేశారు. సాయి సుదర్శన్‌కు తొలి టెస్టు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, గౌహతి మ్యాచ్‌లో కూడా ఛాన్స్ లభించే అవకాశాలు తక్కువే.
అలాగే, ధ్రువ్ జురెల్ కుడి కాలుకు ప్యాడ్లు లేకుండా సాధన చేయడం కనిపించింది. రివర్స్ స్వీప్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో హెడ్‌కోచ్ గంభీర్ సాయి సుదర్శన్ ప్రాక్టీస్‌ను నిశితంగా పరిశీలించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానం కోసం సాయి సుదర్శన్ పోటీ పడుతున్నాడు. కోల్‌కతా టెస్టులో గిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే, సుదర్శన్ నెట్స్‌లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. నెట్ బౌలర్లు చాలా ఇబ్బంది పెట్టారు. గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సైతం బ్రేక్ టైమ్‌లో సాయి సుదర్శన్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చాలా సేపు బ్యాటింగ్ చేసిన జడేజాతో సహా ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.