IND VS SA | లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాల్గో టీ20 మ్యాచ్ పొగమంచు, వాయు కాలుష్యం నేపథ్యంలో రద్దయ్యింది. అయితే, ఈ మ్యాచ్‌ను చూసేందుకు టికెట్లను కొనుగోలు చేసిన ఫ్యాన్స్‌కు డబ్బును రీఫండ్ చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) ప్రకటించింది. బుధవారం జరగాల్సిన మ్యాచ్ విజిబిలిటీ లేకపోవడంతో రద్దయిన విషయం తెలిసిందే. ఆరుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. చివరకు రాత్రి 9.30 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు అదే పద్ధతిలో టికెట్ డబ్బులు రీఫండ్ చేయనున్నట్లు యూపీసీఏ కార్యదర్శి ప్రేమ్ మనోహర్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. రీఫండ్ సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్ ఈ-మెయిల్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రేక్షకులు ఈ-మెయిల్లను చెక్ చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొన్న అభిమానులకు డిసెంబర్ 20 నుంచి 22 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎకానా స్టేడియం రెండోనంబర్ గేట్ వద్ద ఉన్న బాక్సాఫీస్ వద్ద డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల కొన్న వారు రీఫండ్ కోసం వ్యక్తిగతంగా హాజరుకావాలని.. తమ ఒరిజినల్ టికెట్లతో పాటు గుర్తింపు కోసం ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కాపీని తీసుకురావాలని కోరారు. బ్యాంక్ వివరాలతో పాటు రీఫండ్ ఫామ్‌ని ఫిల్ చేసి ఒరిజినల్ టికెట్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. పత్రాలు, సమాచారం ధ్రువీకరించిన తర్వాతే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.
వాస్తవానికి, లక్నోలో మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ, పొగమంచు దట్టంగా స్టేడియాన్ని కమ్మేయడంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అంపైర్లు స్టేడియాన్ని ఆరుసార్లు పరిశీలించారు. టాస్ రాత్రి 6.30 గంటలకు వేయాల్సి ఉండగా.. పొగ మంచు కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత 6.50 గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించారు. ఈ సమయంలో విజిబిలిటీని సైతం అంపైర్లు పరిశీలించారు. పిచ్, బౌండరీ లైన్ల వద్ద అంపైర్లు నిలబడి.. బంతి కనిపిస్తుందా? లేదా? అని పరిశీలించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం మైదాన్ని పరిశీలించారు. అంచనాల మేరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.