Asia Cup | ఆసియా కప్‌లో భాగంగా హైవోల్టేజ్ మ్యాచ్ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌తో ఆడకూడదని.. మ్యాచ్‌లను నిరాకరించాలని పేర్కొంటున్నారు. అయితే, ఈ మ్యాచ్‌పై మాజీ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. మల్టినేషనల్ టోర్నీలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తున్నాయని.. ఆయా మ్యాచులు ఆడకుండా చూడడం సాధ్యం అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఏసీసీ, ఐసీసీ టోర్నీలను నిర్వహించిన సమయంలో అన్ని దేశాలు పాల్గొనడం తప్పనిసరని.. ఒక జట్టు మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే.. ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందని.. లేకపోతే ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు ఇస్తారన్నారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని భారత్ ఇప్పటికే నిర్ణయించిందని.. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను ఆపివేసే వరకు ఇది కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ మ్యాచ్ ప్రాముఖ్యత కేవలం క్రికెట్‌కు మాత్రమే కాదని.. ఇది ఎల్లప్పుడూ రాజకీయ, సామాజిక నేపథ్యంతో ముడిపడి ఉంటుందన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.
దాంతో ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలగాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోవని, కానీ టీం ఇండియా మల్టినేషనల్ టోర్నీల్లో పాల్గొంటుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఆసియాకప్‌లో ఆడేందుకు భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. ఇటీవల భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం ఈ విషయంపై స్పందించారు. భారత జట్టు ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని.. జట్టు కూర్పు బాగుందని.. మ్యాచులు గెలవాలన్నారు. ఆటగాళ్ళు తమ ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాలని.. పరధ్యానం పనికిరాదన్నారు. ప్రభుత్వం తన పని చేస్తుందని.. ఆటగాళ్ళు తమ పని చేయాలన్నారు.