IND Vs PAK | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది రోజులే ఉన్నది. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నది. దాయాది దేశం పాక్‌తో కలిసి భారత్ ఒకే గ్రూప్‌లో ఉన్నది. ఈ మ్యాచ్‌పై పలువురు మాజీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి భారత్-పాక్ మ్యాచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రస్తుత హెడ్‌కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై సైతం స్పందించారు. చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో గ్రూప్ మ్యాచ్‌పై గంభీర్ మాట్లాడుతూ.. ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే ఆ మ్యాచ్ కూడా ముఖ్యమైందేనని చెప్పాడు.
ఈ సందర్భంగా శాస్త్రి స్పందిస్తూ.. తాను ఏడు సంవత్సరాలు కోచ్‌గా ఉన్నానని.. నన్ను అడిగినప్పుడల్లా గంభీర్ చెప్పినదాన్నే తాను చెప్పానని తెలిపారు. ఈ మ్యాచ్ మీరంతా అనుకున్న దానికంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. గంభీర్ ప్రకటన కోవలం మీడియానుద్దేశించి మాత్రమే చేశాడని.. లోపల మాత్రం పాక్‌తో మ్యాచ్ గెలవాలని కోరుకుంటారన్నారు. అలా చేయలేకపోతే మళ్లీ పాక్‌తో మ్యాచ్ ఆడే వరకు పదేపదే గుర్తుకు వస్తుందన్నారు. గతంలో మీరేం చేశారో జనం పట్టించుకోరని శాస్త్రి పేర్కొన్నారు. గతంలో ఎనిమిది, తొమ్మిది, పది మ్యాచులు గెలిచినా పట్టించుకోరని.. కానీ, ఓడిపోయిన ఒక్క మ్యాచ్ ఎంత ముఖ్యమైందో గుర్తు చేస్తారన్నారు. పాక్‌తో మళ్లీ మ్యాచ్ ఆడే వరకు.. ప్రజలు దాన్ని గుర్తుకు చేస్తూనే ఉంటారన్నారు. పాక్‌కు సైతం అవే ప్రశ్నలు ఎదురవుతాయన్నారు.
నచ్చినా నచ్చకపోయినా.. ఈ మ్యాచ్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని మాజీ కోచ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భారత్ ఈ నెల 23న దుబాయిలో ఆడనున్నది. చివరిసారిగా రెండుజట్లు ఈ మైదానంలో 2021 టీ20 వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాక్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత టీమిండియా ఐసీసీ టోర్నీల్లో పాక్‌తో మూడుసార్లు తలపడగా.. మూడు మ్యాచులను నెగ్గింది. 2021లో జరిగిన మ్యాచ్ టీమిండియాను ఎలాంటి ప్రభావం చూపలేదని.. ఎందుకంటే 50 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందని.. ఇది టీ20 కంటే భిన్నంగా ఉంటుందని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.