Virat Kohli | విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. వన్డే కెరియర్లో 51వ సెంచరీ పూర్తి చేశాడు. ఇక భారత్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు ననవజ్యోత్ సిద్ధు స్పందించారు. విరాట్ ఆటపై మక్కువ కలిగిన ఆటగాడని.. పాక్‌పై సెంచరీ చేసిన విధానాన్ని చూస్తే.. రాబోయే రెండు మూడేళ్లు ఆడతాడని అంచనా వేశారు. మరో పది, పదిహేను సెంచరీలు సాధిస్తాడని తాను పూర్తిగా నమ్మకంతో చెబుతున్నానని తెలిపాడు. ఎవరైనా కష్ట సమయాలను ఎదుర్కొంటారని.. గత ఆరు నెలల్లో విరాట్ విషయంలో చాలా జరిగిందన్నారు. పాకిస్తాన్‌పై విరాట్ చేసిన సెంచరీ గుర్తుండి పోతుందన్నారు.
విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు తరానికి ఒకసారి పుడతారని.. అతను కోహినూర్ లాంటివాడని పేర్కొన్నారు. అతన్ని ఆటగాడిగా అంచనా వేసేటప్పుడు అతని ట్రేడ్‌మార్క్ ఏంటో తెలుసుకోవడం ముఖ్యమని.. తాను సచిన్ టెండూల్కర్ చూసిన సమయంలో ఎప్పుడూ బ్యాక్‌ఫుట్ పంచ్ ఇచ్చేవాడని.. గవాస్కర్‌ని పరిశీలిస్తే స్ట్రెయిట్ డ్రైవర్.. విరాట్‌ని పరిశీలిస్తే కవర్ డ్రైవ్ చేస్తాడని.. బంతిని తలపైకి తీసుకుని అందంగా కవర్ డ్రైవ్‌గా మలిచినప్పుడు తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని తెలుస్తుందని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ చేసిన పనికి.. రోహిత్ ముఖంలో చిరునవ్వు రూపంలో చూశానన్నారు. ఇది ఒక జట్టు ఆట.. తోటి ప్లేయర్ జట్టు జభ్యుడి ప్రదర్శన చూసి గర్వపడినప్పుడు.. మంచి సంకేతమని.. అంతా ఒకే కుటుంబంగా ఆడుతున్నారని.. సహచరుడిని చూసి గర్వపడుతున్నారని అర్థమని తెలిపాడు. ఒకరి ఆనందంలో భాగం కావడం, అది స్నేహానికి సంకేతమని సిద్ధు పేర్కొన్నారు.