వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్తుందా? అనే చర్చ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. తాజాగా బీసీసీఐ 91వ వార్షిక జనరల్ మీటింగ్ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు భారత్ వెళ్లడం కష్టం కాబట్టి, ఆసియా కప్‌ను మరేదైనా న్యూట్రల్ వేదికకు మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్‌గా ఉన్న జైషా ఈ వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలు విని తామా షాకయ్యామని, అలాగే డిసప్పాయింట్ అయ్యామని తెలిపింది. షా వ్యాఖ్యలు ఏసీసీ ఏర్పడిన కారణాన్ని తుంగలో తొక్కేశాయని అభిప్రాయపడింది. ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌తోపాటు, 2024-2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు పాకిస్తాన్ వచ్చే అవకాశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని పరోక్షంగా హెచ్చరించింది.