టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో వికెట్ తీసుకున్నాడు. 14వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకున్న అతను.. 16వ ఓవర్లో మరోసారి సత్తా చాటాడు. హార్దిక్ వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో కంగారు పడిపోయిన మహమ్మద్ నవాజ్.. ఆ బంతిని షార్ట్ థర్డ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని గ్లవ్‌ను తాకిన బంతి కీపర్ చేతుల్లో పడింది. దీంతో ఆ జట్టు 16 ఓవర్లకు 116/6 స్కోరుతో నిలిచింది.
ఆ మరుసటి ఓవర్లో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ కూడా మరో వికెట్ తీసుకున్నాడు. అర్షదీప్ వేసిన షార్ట్ బాల్‌ను ఆడటంలో తడబడిన ఆసిఫ్ అలీ (2).. కిందకు వంగి దాన్ని వదిలేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి అతను అనుకున్నంత ఎత్తుకు లేవలేదు. మొఖం మీదకు వచ్చేసిన బంతికి బ్యాటును అడ్డుపెట్టుకున్నాడు. దీంతో గ్లవ్‌ను తాకిన బంతి కీపర్ వైపు వెళ్లింది. డీకే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టేశాడు. దీంతో పాక్ జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి 125/7 స్కోరుతో నిలిచింది.