Mohammed Shami | దుబాయి వేదికగా భారత్-పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ క్రీజులో ఉండగా.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌ను ప్రారంభించాడు. తొలి ఓవర్లో షమీ ఐదు వైడ్స్ వేశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లనే షమీ పదకొండు బంతులు విసిరాడు. బౌలింగ్ సమయంలో షమీ పూర్తి లయలో కనిపించలేదు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సమయంలో మైదానాన్ని వీడాడు. దాంతో టీమిండియా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. షమీకి మళ్లీ ఏమైనా గాయమైందా? అంటూ ఆరా తీశారు. అయితే, ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
పాక్‌తో మ్యాచ్‌లో షమీ సైతం మధ్యలోనే మైదానాన్ని వీడడంతో టీమిండియా అభిమానులు కలవరానికి గురయ్యారు. మళ్లీ పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలోకి రాగా.. ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత 12వ ఓవర్లో బౌలింగ్‌కి వచ్చాడు. వాస్తవానికి, ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో షమీ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అతనికి అది మూడో ఓవర్. నాల్గో బంతి తర్వాత.. కాస్త ఇబ్బంది పడుతూ కనిపించగా.. ఫిజియో మైదానంలోకి వచ్చాడు. ఆ ఓవర్లో బౌలింగ్ బాగానే చేసినా.. రన్ అప్‌లో ఇబ్బందిపడ్డాడు. దాంతో ఫిజియోకి చూపించాల్సిన అవసరం ఉందని భావించాడు. గతకొంత కాలంగా చీలమండ సమస్యతో సమీ బాధపడుతున్నారు. ఆ ఓవర్లో మరో రెండు బంతులు వేసి మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ 12 ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో పూర్తి లయతో బౌలింగ్ చేసిన షమీ.. ఆ ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత గాయంతో షమీ టీమిండియాకు దూరమయ్యాడు. ఆ తర్వాత షమీకి సర్జరీ జరిగింది. దాదాపు 14 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ.. కోలుకొని ఇంగ్లాండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో తన తొలి స్పెల్‌లో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. 2024లో బర్మింగ్‌హోమ్‌లో ఇంగ్లాండ్‌పై తినాషే పన్యాంగర ఏడు వైడ్లు వేయగా.. చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీ తొలి ఓవర్లోనే ఐదు వైడ్లు వేశాడు. తొలి స్పెల్‌లో షమీ సగటు వేగం 131.7 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసిన షమీకి.. 2015 తర్వాత వన్డేల్లో ఓపెనింగ్ స్పెల్‌లో అత్యల్ప వేగంతో బంతులు విసరడం ఇదే తొలిసారి.