IND vs PAK Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 12వ సారి. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇక చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ట్రెండ్ కొనసాగుతున్నది. టాస్ ఓడిపోయినా ఇంగ్లాండ్‌ను భారత్ 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఐసీసీ ఈవెంట్లో తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
వన్డేల్లో టీమిండియా వరుసగా 12వ టాస్ ఓడిపోగా.. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఒక్కసారి సైతం భారత జట్టు టాస్ గెలువలేకపోయింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో, దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్, శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు తాజాగా బంగ్లాదేశ్, పాక్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లోనూ భారత జట్టు టాస్ ఓడిపోయింది. టాస్ ఓడిన 11 వన్డేల్లో భారత జట్టు ఆరింట్లో విజయం సాధించగా.. నాలుగు మ్యాచుల్లో పరాజం పాలైంది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. వన్డేల్లో అత్యధిక వరుస టాస్‌లు ఓడిన నెదర్లాండ్‌ను భారత జట్టు అధిగమించి టీమిండియా ఈ రికార్డును సృష్టించింది. నెదర్లాండ్స్ జట్టు మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడిపోయింది.
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ తుది జట్టులో ఒక మార్పులు చేసింది. గాయపడ్డ ఫకార్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాడు. టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకునే వాడనని తెలిపాడు. టాస్ ఓడడం వల్ల ఎలాంటి నష్టం లేదని తెలిపాడు.