IND vs PAK | ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కరచాలనం వివాదంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు మద్దతు ప్రకటించారు. జింబాబ్వే అధికారి స్కూల్ టీచర్ కాదని, ఆయన తన పాత్రను బాగా నిర్వహిస్తున్నాడని అశ్విన్ పేర్కొన్నారు. గత ఆదివారం ఆసియా కప్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు విధానపరమైన నిర్ణయం ప్రకారం.. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయనప్పుడు పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయకపోవడంపై వివాదం చెలరేగగా.. ఇందులోకి పీసీబీ పైక్రాఫ్ట్‌ను లాగింది.
ఈ మేరకు పాక్ బోర్డు ఐసీసీకి రెండు మెయిల్స్ పంపింది. పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించాలని కోరింది. ఆపై ఆయనను పాక్ మ్యాచుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేయగా.. ఐసీసీ తిరస్కరించింది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్ ‘ఆష్ కి బాత్’ లో అశ్విన్ మాట్లాడుతూ.. ఆండీ పైక్రాఫ్ట్ నిజానికి అందరినీ ఒక అసహ్యకరమైన దృశ్యాన్ని చూడకుండా కాపాడాడని పేర్కొన్నారు. ఇది మా నిర్ణయం.. దానికి కట్టుబడి ఉంటామని భారత్ ఇప్పటికే మ్యాచ్ రిఫరీకి స్పష్టం చేసిందని మాజీ స్పిన్నర్ పేర్కొన్నాడు. ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత.. మీరు (పాకిస్తాన్) మ్యాచ్ ఓడిపోయిందని.. మరి మీరు దేని గురించి ఫిర్యాదు చేస్తున్నారు? ఆయన స్కూల్ టీచర్ కాదు.. ప్రిన్సిపాల్ కాదు.. సూర్యతో కరచాలనం చేయమని చెప్పలేకపోయాడని.. అది ఆయన పని కాదని.. ఇందులో పైక్రాఫ్ట్ తప్పు ఏంటని ప్రశ్నించాడు.
పైక్రాఫ్ట్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించాడనే పీసీబీ వాదనలను ఐసీసీ తోసిపుచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వేదిక మేనేజర్ చెప్పిన దాన్ని మాత్రమే ఉటంకిస్తున్నారని ఐసీసీ స్పష్టం చేసింది. భారత ఆటగాళ్ళు తమ బోర్డు సూచనలను పాటిస్తున్నారని, పైక్రాఫ్ట్‌కు ఇచ్చిన సమాచారం అస్పష్టంగా లేదని అశ్విన్ తెలిపాడు. పాకిస్తాన్ క్షమాపణ కోరడంపై కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఆండీ పైక్రాఫ్ట్ అయితే, మీరే తనకు క్షమాపణ చెప్పేవారని.. తాను దేనికి క్షమాపణ చెప్పేవాడిని? అని ప్రశ్నించాడు.