IND vs NZ : పొట్టి క్రికెట్లో భారత జట్టు తమకు తిరుగులేదని చాటుతూ వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో పంజా విసిరింది. గువాహటిలో ఓపెనర్ అభిషేక్ శర్మ(68 నాటౌట్) శివాలెత్తిపోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(57 నాటౌట్) బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరి విధ్వంసంతో కివీస్ బౌలర్లు కుదేలవ్వగా.. పది ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉఫ్‌మనిపించింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్యాటుతో, బంతితో తేలిపోయిన కివీస్ మూడో ఓటమితో సిరీస్ సమర్పించుకుంది.
గువాహటిలో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు బ్రేకులు వేశారు. భారీ స్కోర్‌తో సిరీస్ కాపాడుకోవాలనుకున్న వారి ప్రయత్నాలకు గండికొడుతూ.. వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. జస్ప్రీత్ బుమ్రా(3-17) విజృంభణకు రవి బిష్ణోయ్(2-18)స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా.. కివీస్ హిట్టర్లు తడబడ్డారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును గ్లెన్ ఫిలిప్స్(48), మార్చ్ చాప్మన్(32), కెప్టెన్ మిచెల్ శాంట్నర్(27) ఆదుకున్నారు. వీరి మెరుపులతో కోలుకున్న బ్లాక్‌క్యాప్స్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.