Virat Kohli: ఇండియా – ఇంగ్లండ్ మధ్య లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్.. 9 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే డేవిడ్ విల్లే వేసిన ఏడో ఓవర్ ఐదో బంతికి బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్ అవడం ద్వారా కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీకి ఇదే తొలి డకౌట్ కావడం గమనార్హం.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కలుపుకుని కోహ్లీ.. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లలో 57 ఇన్నింగ్స్ ఆడగా అందులో సున్నాకు నిష్క్రమించడం ఇదే ప్రథమం. వన్డేలలో 32, టీ20లలో 25 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ గతంలో ఈ మెగా టోర్నీలలో ఆడుతూ కనీసం ఒక్క పరుగైనా చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపై, 2015లో ఆసీస్‌పై, 2019లో న్యూజిలాండ్‌పై కోహ్లీ ఒక్క పరుగు చేసి నిష్క్రమించిన సందర్భాలున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ భారత్ ఓడిపోయింది. మొత్తంగా ప్రపంచకప్‌లలో ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైన (వన్డేలలో ఆరుసార్లు) కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోరు.
సచిన్ తర్వాత..
మూడేండ్ల వైఫల్యాల తర్వాత గతేడాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ ఈ ఏడాది కూడా వన్డేలలో మునపటి ఫామ్ అందుకుని సెంచరీలు బాదుతున్నాడు. 2023లో కోహ్లికి ఇదే తొలి డకౌట్. తద్వారా కోహ్లీ డకౌట్లు అవడం 34వ సారికి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ నుంచి సచిన్ (అన్ని ఫార్మాట్లలో) డకౌట్ ల రికార్డును కోహ్లీ సమం చేశాడు.