Rohit Sharma: స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు తొలి టెస్టులో ఓటమికి బదులుతీర్చుకోవాలని భావిస్తున్నది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆడనున్నది. ఈ టెస్టులో గెలిచి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న టీమిండియాకు వైజాగ్ స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ భారత జట్టుకు ఓటమన్నదే లేదు. వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. రెండింటి లోనూ ఘన విజయం సాధించింది. ఇక రోహిత్‌కు అమ్మమ్మగారి (రోహిత్ తల్లి వైజాగ్‌కు చెందినవారే) ఇంట్లో ఘనమైన రికార్డు ఉంది.
వైజాగ్‌లో భారత్ రెండు టెస్టులు ఆడితే అందులో హిట్‌మ్యాన్ ఒక టెస్టు ఆడాడు. 2019లో ఇక్కడ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో భాగంగా రోహిత్ ఏకంగా 303 పరగులు సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు సెంచరీలు బాదాడు. సఫారీలతో జరిగిన తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (215)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 317 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ – అగర్వాల్‌ల బాదుడుతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 502 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 160 పరుగులు సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 323 పరుగులు చేయగా అందులో రోహిత్ మరో సెంచరీ (127)తో మెరిశాడు. 395 పరుగుల ఛేదనలో సఫారీలు 191 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్.. 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన రోహిత్.. ఈ వేదిక బాగానే కలిసొచ్చింది. అప్పుడు సఫారీలకు చుక్కలు చూపిన హిట్‌మ్యాన్.. తాజాగా ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టులో తలపడనున్న విషయం తెలిసిందే.
Rohit Sharma has played one Test match at Vishakhapatnam and he scored Hundreds in both innings.
– 176(244).
– 127(149).– THE HITMAN…!!!! pic.twitter.com/4Tb2S7t5yJ
— CricketMAN2 (@ImTanujSingh) January 31, 2024
సఫారీల కంటే ముందే 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో (ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు) మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 455 పరుగులు చేసింది. పుజారా (119), కోహ్లీ (167) సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 255 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 204 పరుగులకే పరిమితమై ఇంగ్లండ్ ఎదుట 405 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. కానీ ఇంగ్లండ్.. 158 రన్స్‌కే చాపచుట్టేయడంతో కోహ్లీ సేన 246 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.