Ravi Shastri | టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాష్టింగన్ సుందర్‌ను మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. భవిష్యత్‌లో సుందర్ భారత జట్టు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారుతాడని ఆశాభవం వ్యక్తం చేశారు. పరిస్థితులను బట్టి బౌలింగ్ చేయడంతో పాటు సహజంగానే బ్యాటింగ్ చేయగల ప్రతిభ ఉన్న ఆటగాడని తెలిపాడు. ఓర్పు, సాంకేతిక నైపుణ్యం అద్భుతమని.. దాంతో సుదీర్ఘ ఫార్మాట్లో విజయం సాధించగలడంటూ ప్రశంసలు కురిపించారు రవిశాస్త్రి.
2021లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియతో జరిగిన టెస్టులతో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడి 545 పరుగులు చేయడంతో పాటు 30 వికెట్లు పడగొట్టాడు. సుందర్ రెడ్‌బాల్ మ్యాచులు మరిన్ని ఆడాల్సిందని.. ముఖ్యంగా భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై ఆడించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ తనకు సుందర్ ఆట నచ్చుతుందని.. తొలిసారి అతన్ని చూసినప్పుడు అద్భుతమైన ఆటగాడని అనిపించింది, చాలా సంవత్సరాలు అత్యుత్తమ ఆల్‌రౌండ్‌గా మారే అవకాశం ఉందని తాను చెప్పానని గుర్తు చేశారు. ప్రస్తుతం అతని వయసు 25 సంవత్సరాలేనని.. భవిష్యత్ మరింత టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని తాను అనుకుంటున్నానన్నారు.
భారత్, న్యూజిలాండ్‌లాంటి టర్నింగ్ పిచ్‌లపై ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తాడని.. కొందరు సీనియర్ స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తాడని.. అదే సమయంలో బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో 2024 స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్‌లోని నాలుగు ఇన్నింగ్స్‌లో 16 వికెట్లు తీశాడు. సుందర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. అతన్ని ముందుగానే బ్యాటింగ్‌కు పంపవచ్చని.. సహజంగానే ప్రతిభావంతుడని శాస్త్రి పేర్కొన్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ కాకుండా ఆరో నెంబర్లోనూ పరుగులు చేయగలడని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.