IND Vs ENG | చాలా నెలల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన చాంపియన్స్ ట్రోఫీకి ముందు సెంచరీ చేయడంతో టీమ్ మేనేజ్మెంట్కు కాస్త ఉపశమనం కలిగించినట్లయ్యింది. భారత జట్టు బ్యాటింగ్ కలయిక విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతున్నది. ఐసీసీ ఈవెంట్‌కు ముందు చివరిగా బుధవారం టీమిండియా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేను ఆడనున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు ప్రయోగాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే సిరీస్‌లో ఆరో ప్లేస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పటి వరకు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఒక్క మ్యాచ్‌ను ఆడించకపోవడో బ్యాటింగ్ ఆర్డర్లో సమీకరణాలు కాస్త క్లిష్టంగా ఉన్నాయి. రెండు మ్యాచ్‌లలో అక్షర్‌పటేల్ తర్వాత మాత్రమే కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చినా.. న్యాయం చేయలేకపోయాడు. ఆరు నెలల తర్వాత మళ్లీ వన్డేల్లోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నా.. తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. మరో వైపు బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు.
అయితే, అక్షర్ పటేల్ తర్వాత రాహుల్‌ను పంపడంపై పలువురు మాజీలు ప్రశ్నలు లేవనెత్తారు. కటక్ వన్డేలో రవిశాస్త్రి రాహుల్ లాంటి టాప్ ఆర్డర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌ను ఆరో నంబర్లో పంపడం సరికాదన్నారు. తొలి రెండు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాహుల్ కంటే ముందు అక్షర్‌ను పంపడానికి ఎడమ, కుడి బ్యాటింగ్ కలయిక ఫార్ములాపై టీమ్ మేనేజ్మెంట్ పట్టుదలగా ఉంటే.. రిషబ్ పంత్ లాంటి ఆగటాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తొలి రెండు వన్డేల్లో అక్షర్ పటేల్ 52, 41 నాటౌట్‌గా రాణించినప్పటికీ.. టీమిండియా విజయం దిశగా పయనిస్తున్న సమయంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. భారత్‌లో తదుపరి మ్యాచ్, చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే ఫార్ములా గురించి ఆలోచిస్తూ ఉండవచ్చని రవిశాస్త్రి పేర్కొన్నారు. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడని.. ఈ విషయంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పంత్ 31 వన్డేల్లో 33 కంటే ఎక్కువ సగటుతో 871 పరుగులు చేశాడు.
ఇవేం అంత గొప్ప గణాంకాలు కానప్పటికీ.. గత కొన్నేళ్లుగా క్రికెట్ పారామీటర్స్ మారిపోయాయి. నిర్దిష్ట దశలో ఆటగాడు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాడో కూడా చూడాలని.. రాహుల్‌ను వన్డేల్లో 30.. 35వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడిగా చూస్తున్నారని.. కాబట్టి పంత్ అతని కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నది. భారత బౌలర్లు రెండు వన్డేల్లోనూ ఇంగ్లాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ, 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఐదో నంబర్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రాహుల్, అతని ఆట తీరుకు సరిపోని పరిస్థితిలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. గంభీర్ వ్యూహాలను నిశితంగా గమనించిన భారత మాజీ ఆటగాడు, గౌతమ్ ఎల్లప్పుడూ జట్టు అవసరాలను చూస్తాడని.. రాహుల్ ఆరో నంబర్లో సరిపోతాడని భావిస్తున్నాడని, ఎందుకంటే ఇది అతనికి ఎడమ-కుడి చేతి బ్యాట్స్‌మెన్ కలయికను కొనసాగించడానికి సహాయపడుతుంది. అక్షర్ ఐదో నంబర్లో పరుగులు చేశాడని.. ఇది పంత్‌ను క్లిష్ట పరిస్థితుల్లో పడేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.