Rohit Sharma | ఈ నెల 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలవనున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్‌ను నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయంపై వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని చెప్పాడు. ఇక అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో సందేహాలను సైతం నివృత్తి చేశాడు. ఆదివారం ఎంసీజీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ ఎడమ మోకాలికి బంతికి తగలడంతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? అనే అనుమానాలు తలెత్తాయి.
ఈ క్రమంలో హిట్‌మ్యాన్ స్పందిస్తూ ప్రస్తుతం మోకాలు బాగానే ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్ల ఫామ్‌పై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి రోహిత్ మాట్లాడాడు. అతనితో చాలా సమయం గడిపానని.. ఎన్నో మ్యాచులు ఆడానని చెప్పాడు. ఈ క్రమంలో అతను ఎలా ఆలోచిస్తాడో తెలుసునని తెలిపాడు. అలాంటి ఆటగాడు ఉండడం జట్టుకు ఎంతో మేలు చేస్తుందన్నాడు. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారోనని ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించాడు. తాను ఇక్కడ చర్చించే విషయం కాదని.. జట్టుకు ఏది మంచిదో అదే చేస్తానని కెప్టెన్ చెప్పాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌పై సైతం స్పందించాడు. ‘ఆఫ్ స్టంప్ వెలువపల బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్నాడు’ ప్రశ్నకు.. విరాట్ ఓ గొప్ప బ్యాట్స్‌మెన్ అని.. సమస్యను అధిగమించేందుకు ఓ మార్గాన్ని కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
విరాట్ తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేశాడు. మూడో టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి టెస్టు మ్యాచ్‌లో 161 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని.. తర్వాతి నుంచి పరుగులు చేయడంలో చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని ప్రశ్నించగా.. రోహిత్ స్పందిస్తూ సహజసిద్ధంగా ఉండేలా ప్రోత్సహిస్తామని చెప్పాడు. జైస్వాల్ మైండ్‌సెట్‌ను మార్చడం తమకు ఇష్టం లేదని.. తన బ్యాటింగ్‌ను అందరికీ బాగా అతనే అర్థం చేసుకున్నాడని.. అతన్ని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహిస్తామని టీమిండియా కెప్టెన్ వివరించాడు.