IND vs AUS | పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. ఊహించిన విధంగానే మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. ఒక్కో బౌలర్‌కు ఏడు ఓవర్లు వేయనున్నారు. ఇదిలా ఉండగా.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ నిర్ణయానికి తగినట్లుగా ఆసిస్ బౌలర్లు చెలరేగారు. దాంతో టీమిండియా బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. కంగారుల బౌలింగ్ ధాటికి టీమిండియా ఎనిమిది ఓవర్లలో కీలక మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) పరుగులకు పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా చిక్కుల్లో పడింది. తొలుత జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని షాట్ ఆడబోయి స్లిప్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మిచెల్ స్టార్క్ వేసిన బంతిని బౌండరికి తరలించేందుకు ప్రయత్నించిన విరాట్ కలోలీ చేతికి చిక్కి డకౌట్ అయ్యారు. ఆ తర్వాత ఎల్లిస్ బౌలింగ్‌లో గిల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ 12.20 గంటలకు ప్రారంభమైంది. శ్రేయాస్ అయ్యర్, అక్సర్ పటేల్ బ్యాటింగ్‌కు వచ్చారు. అయ్యర్ 24 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత జట్టు 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అక్సర్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 14.2 ఓవర్ల సమయంలో మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు మ్యాచ్ మొదలైన 20 నిమిషాల్లోగానే మళ్లీ మూడోసారి కురిసింది. ప్రస్తుతం టీమిండియా 14.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.