Rohit Sharma | భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై మరోసారి చర్చ సాగుతున్నది. పేలవమైన కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా మరోసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడో టెస్ట్ రెండురోజు తొలి సెషన్లోనే టీమిండియా శుభారంభం చేసింది. తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే, ఆ తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలోనే ఇద్దరు సెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియా స్కోరు 317 వద్ద నాలుగో దెబ్బకు తగిలింది. స్టీవ్ స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. 75 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను స్మిత్-హెడ్ జోడీ 317 పరుగుల వరకు తీసుకెళ్లారు. నాలుగో వికెట్‌కు 242 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.
భారత్‌తో టెస్టులో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. స్మిత్, హెడ్ ఇద్దరూ కలిసి టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్మిత్ ఇచ్చిన ఓ క్యాచ్‌ను సైతం మిస్ చేశాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ భాగస్వామ్యం నెలకొల్పిన నేపథ్యంలో టీమిండియా అభిమానులు హిట్ మ్యాన్ కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ నిర్ణయాన్ని సైతం అభిమానులు విమర్శించారు. అదే సమయంలో మ్యాచ్‌లో రోహిత్ అనుసరించిన వ్యూహాలపై సైతం విమర్శలు గుర్పించారు. స్మిత్, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ సమయంలోనూ సరిగ్గా ఫీల్డింగ్ సెట్ చేకపోవడంతో పరిస్థితిని ఇద్దరూ బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. అభిమానులతో పాటు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం రోహిత్ కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెడ్ బ్యాటింగ్ సమయంలో అల్ట్రా డిఫెన్సివ్ ఫీల్డ్‌ని సెట్ చేశాడని.. అది పేలవంగా ఉందంటూ విమర్శించారు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం రవిశాస్త్రితో ఏకీభవించాడు. ట్రావిస్ హెడ్‌పై దూకుడుగా వైఖరిని అవలంభించాల్సి ఉందని చెప్పాడు. మరో వైపు మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బంగార్ సైతం రోహిత్ వ్యూహాలపై విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించిన ఈ మ్యాచ్‌లో రోహిత్ ప్లాన్ ఇప్పటి వరకు ఫలించలేదన్నారు. ట్రావిస్ హెడ్ వరుసగా టీమిండియాపై రెండో సెంచరీ సాధించగా.. స్మిత్ సైతం 17 నెలల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీను నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. టీమిండియా తరఫున టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. నితీశ్‌రెడ్డి, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.