Virat Kohli | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరోసారి టాప్ ఆర్డర్ విఫలమైంది. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. 69 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. బ్యాటింగ్ చేసిన సమయంలో ఒక్క ఫోర్ సైతం కొట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్‌లో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన విరాట్.. ఆ తర్వాత వరుసగా ప్లాఫ్ షో కొనసాగిస్తున్నాడు. అంతే కాదు.. గతేడాది జనవరి 3 నుంచి నేటి సిడ్నీ వరకు టెస్టు వరకు కేవలం రెండుసార్లు మాత్రం 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఏడుసార్లు అవుట్ అయ్యాడు. అయితే, ఈ ఏడుసార్లు బంతి బ్యాట్ అంచును తాకి వికెట్ల వెనక్కి వెళ్లి కీపర్, స్లిప్ ఫిల్డర్ల చేతుల్లో పడింది.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 184 పరుగులు చేయగలిగాడు. గత ఇన్నింగ్స్‌లో 17, 5, 36, 3, 11, 7, 100 (నాటౌట్), 5 పరుగులు చేశాడు. ఏడుసార్లు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫాస్ట్ బౌలర్లు ఆఫ్ స్టంప్ ఆవల వేసే బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తూ.. క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పలుసార్లు అవుట్ అయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో 98 బంతులు ఆడి.. 32 పరుగులు చేశాడు. బోలాండ్ బౌలింగ్‌లో విరాట్ కీపర్, స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి నాలుగు సార్లు అవుట్ అయ్యాడు.
గత ఏడాది జనవరి 3 నుంచి విరాట్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌పై 70 రన్స్, పెర్త్‌లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2024లో విరాట్ మొత్తం పది టెస్టుల్లో కలిపి 19 ఇన్నింగ్స్‌లో 24.52 సగటుతో 417 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మరో ఆఫ్ సెంచరీ ఉన్నది. సిడ్నీ టెస్టులో 69 బంతులు ఆడిన కోహ్లీ ఒక్క బౌండరీ సైతం బాదలేకపోయాడు. విరాట్ టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఒక్క బౌండరీ కొట్టకుండా ఆడిన సుదీర్ఘ ఇన్నింగ్స్ ఇదే కావడం గమనార్హం.
సిడ్నీ టెస్టులో టీమిండియా పరుగులు చేసేందుకు తండ్లాడుతున్నది. రెండు సెషన్లు ముగిసే వరకే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. విరాట్‌తో పాటు యశస్వి జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ (4), శుభ్‌మన్ గిల్ (20) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. యశస్వీని బోలాండ్, రాహుల్‌ను స్టార్క్, గిల్‌ను లియాన్ అవుట్ చేశారు. టీ బ్రేక్ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారీ షాట్‌కు యత్నించి బోలాండ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్‌రెడ్డి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగింది. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్.. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. హిట్‌మ్యాన్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో వెనుకలో ఉన్నది. ఈ టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నది.