ఆసియా కప్‌తో తిరిగి ఫామ్ అందుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత క్రీడాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగే సిరీసులతోపాటు టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీ దుమ్ముదులుపుతాడని ఆశిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమిన్స్.. కోహ్లీ ఒక క్లాస్ ప్లేయర్ అని, ఏదో ఒక టైంలో కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అనుకుంటూనే ఉన్నామని చెప్పాడు.
ఇప్పుడు అతను ఫామ్‌లోకి రావడంతో వచ్చే వారంలో జరిగే టీ20 సిరీసులో తమకు పెద్ద సవాల్‌గా మారబోతున్నాడని అన్నాడు. కాగా మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మొదలు కానుంది. తొలి మ్యాచ్ పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మైదానంలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో ఆస్ట్రేలియా మీద ఇక్కడ ఆడిన మ్యాచుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. దాంతో వచ్చే మ్యాచ్‌లో కూడా కోహ్లీ మెరుపులు మెరిపిస్తాడని భారత అభిమానులు భావిస్తున్నారు.