Jasprit Bumrah | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్నది. పెర్త్ టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమిండియా ఘన విజయం అందుకున్నది. ఈ మ్యాచ్‌లో బుమ్రా విధ్వంసక బౌలింగ్‌తో ఆస్ట్రేలియా కుప్పకూలింది. ప్రస్తుతం ఆ జట్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో అతన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు వేస్తున్నది. అడిలైడ్ టెస్ట్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టుతో పాటు మీడియాలోనూ బుమ్రా గురించే చర్చ సాగుతున్నది. పెర్త్ టెస్ట్‌లో 72 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి భారత్‌కు 295 పరుగుల విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌ను ఆస్ట్రేలియా వెటరన్స్ తుఫానుతో పోల్చారు. అడిలైడ్ టెస్ట్‌లో బుమ్రాను ఎదుర్కోవాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసిస్ జట్టుకు సూచించాడు.
ఆస్ట్రేలియాపై బుమ్రా రికార్డు మెరుగ్గానే ఉన్నది. ఆసిస్ గడ్డపై ఎనిమిది టెస్టులు ఆడిన బుమ్రా 18.80 సగటుతో మొత్తం 40 వికెట్లు తీశాడు. అడిలైడ్ టెస్ట్‌లో బుమ్రాను పింక్ బాల్‌తో ఎదుర్కోవడం కష్టమేనని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే పింక్ బాల్ చాలాసమయం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పింక్ బాల్ టెస్ట్‌లో బుమ్రాకు మంచి రికార్డే ఉన్నది. ఈ మిస్టరీ బౌలర్ మూడు డే-నైట్ టెస్టులో ఆడాడు. ఇందులో 14.50 సగటుతో పది వికెట్లు తీశాడు. 2020 అడిలైడ్ టెస్ట్‌లో కేవలం రెండువికెట్లే తీయగలిగాడు. పెర్త్ టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ.. మిస్టరీ బౌలర్‌పై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ఓ గొప్ప ఔలర్ అని.. భారత జట్టు బౌలింగ్ బాధ్యతలను తన భుజాలపై మోస్తున్నాడన్నాడు.
తమ బ్యాటర్స్ ప్రపంచస్థాయి ఆటగాళ్లని.. ఎప్పుడూ బౌలర్లను ఎదుర్కొనేందుకు పరిష్కారాలను కనుక్కుంటారన్నాడు. తమ బ్యాటర్లు సెకండ్ స్పెల్‌లో బంతిని బాగా ఎదుర్కొంటారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. బంతి పాతబడుతున్న కొద్దీ బ్యాటింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ ఎలా ఎదురుదాడి చేసాడో పెర్త్‌లో చూశామని.. ఇదే నమ్మకం ఉందన్నాడు. బుమ్రాతో పాటు ఇతర భారత బౌలర్లను ఖచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. అడిలైడ్ టెస్ట్‌పై గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ బుమ్రాను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఓపికగా ఉండాలని సూచించాడు. బుమ్రా ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని.. తద్వారా స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాలు తిరిగి ఫామ్‌లోకి రావచ్చన్నాడు. మార్కస్ లాబుష్చాగ్నే మొదట్లో కనీసం 50 బంతులను ఓపికగా ఎదుర్కోవాలని.. ఆ తర్వాత సరైన దిశలో సాగుతారని చెప్పాడు.
ఇక ఇంగ్లండ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ సైతం బుమ్రాను మెచ్చుకున్నాడు. పెర్త్ టెస్ట్‌లో మొదట బ్యాటింగ్ చేయడం సాహసోపేతమైన నిర్ణయమని ప్రశంసించాడు. కెప్టెన్ మరొకరయి ఉంటే.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకునేవాడని.. కానీ, బుమ్రా అలా చేయలేదన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు సహనం కోల్పోకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించిందన్నాడు. బుమ్రా నాయకత్వంలో ఆస్ట్రేలియాను కేవలం 104 పరుగులకే కట్టడి చేయడం ద్వారా టెస్ట్‌లో ఆధిక్యం సాధించిందని.. తొలి టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేయడం భారత జట్టు ధైర్యంగానూ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలదన్న విశ్వాసంతో ఉందని ప్రశంసించాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని తుది 11 మంది జట్టులోకి తీసుకోకపోవడంపై స్పందించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్ అని.. అన్ని రంగంలోకి దించకపోవడంపై ఎంత ధైర్యంగా ఉన్నారో (టీమిండియా) ఆలోచించాలని చెప్పాడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్ అని.. అతను ఎ్పుడూ బెస్ట్ ప్రదర్శన చేస్తాడని.. జట్టు మద్దతు తెలుపుతుందన్నాడు.