Sydney Test | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా వెనుకపడింది. ఈ క్రమంలో ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కసితో ఉంది. ఈ క్రమంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను విశ్రాంతి పేరుతో టీమ్ మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించింది. సిడ్నీ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు రెండు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది.
నిర్ణయాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభం అందిస్తారని ఆశించగా.. టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా స్కోరు 11 ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియాకు తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కాన్స్టాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కోని 4 రన్స్ చేశాడు.
ఆ తర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం పెవిలియన్‌కు చేరాడు. 17 పరుగుల వద్ద స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో బ్యూ వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (11) క్రీజులో ఉన్నారు. అయితే, భారత్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఎనిమిదో ఓవర్ ఐదో బంతిని ఆడిన విరాట్ కోహ్లీ మరోసారి ఆఫ్ స్టంప్ ఆవల బంతిని వెంటాడగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి స్లిప్‌లోకి వెళ్లింది. స్మిత్ డ్రైవ్ చేసి ఒంటి చెత్తో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా.. ఫీల్డ్ అంపైర్స్ థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. బంతి నేలను తాకినట్లు రీప్లేలో తేలింది. దాంతో విరాట్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
టీమిండియా ప్లేయింగ్-11 : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు : సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.