Cheteshwar Pujara | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియాపై మాజీలతో పాటు అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో రోహిత్ సేన వైట్‌వాష్‌కు గురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుల్లో భారీ విజయం సాధించిన టీమిండియా.. అడిలైడ్, మెల్బోర్న్లో ఓటమిపాలు కాగా.. గబ్బా టెస్ట్‌ని డ్రాగా ముగిచింది. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పూజారాను జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గంభీర్ భావించాడని సమాచారం. హెడ్‌కోచ్ ప్రతిపాదనను సెలెక్టర్లు తిరస్కరించినట్లు ఓ నివేదిక తెలిపింది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆటగాళ్ల ప్రదర్శనపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పూజారా టీమిండియా తరఫున వందకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. అయితే, 2023 ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. ఫైనల్లో ఆస్ట్రేలియతో జరిగిన మ్యాచ్‌లో పుజారా రెండు ఇన్నింగ్స్‌లో కేవలం 14, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గంభీర్ ఆటగాళ్ల తీరును తప్పుపట్టినట్లు తెలిస్తుంది. జట్టు చర్చించిన ప్రణాళికలను అమలు చేయకుండా ఎవరి ఇష్టానుసారం వారు చేస్తున్నట్లుగా ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా నివేదిక పేర్కొంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ నుంచి బ్యాట్స్‌మెన్ పేవల ప్రదర్శన కొనసాగుతుందని.. ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తున్నది. అయితే, ఆటగాళ్లు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో భారత టాప్ ఆర్డర్ వరుసగా విఫలమైంది. ఈ క్రమంలో పుజారాలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరమని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియాలో 11 మ్యాచ్‌లు ఆడిన పుజారా 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు. పెర్త్ టెస్టులో విజయం సాధించిన తర్వాత సైతం.. గంభీర్ పుజారా విషయంపై చర్చించినట్లు సమాచారం. 2018-19 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా నిలిచాడు. 1258 బంతులు ఎదుర్కొని 521 పరుగులు చేశాడు. పుజారా గతంలో టెస్టు జట్టులో కీలకమైన ఆటగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం పుజారాను ప్రశంసించాడు. సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. గత అక్టోబర్‌లో పుజారా రంజీల్లో డబుల్ సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు.