ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో మరోసారి భారత బౌలింగ్ తేలిపోయింది. బ్యాటర్లు చేసిన 208 పరుగుల స్కోరును భారత్ కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా మీద టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంత స్కోరును కూడా భారత బౌలర్లు కాపాడుకోలేకపోవడంతో క్రీడాభిమానులేకాదు, మాజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ ఓటమిపై మాట్టాడుతూ.. ‘మేం బౌలింగ్ సరిగా చేయలేదు. 200 పరుగులు చాలా మంచి స్కోర్. దీన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఫీల్డింగ్‌లో కూడా మాకు దక్కిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాం. బ్యాటర్లు రాణించినా బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు’ అని స్పష్టంగా చెప్పేశాడు. భారత బౌలర్లలో నాలుగు ఓవర్లు వేసిన భువీ (52), హర్షల్ పటేల్ (49) పరుగులు సమర్పించుకోగా.. రెండేసి ఓవర్లు వేసిన హార్దిక్ (22), ఉమేష్ (2/27) పరుగులు ఇచ్చారు.
అయితే ఉమేష్ రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక జట్టులో ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కేవలం 3.2 ఓవర్లలోనే 42 పరుగులు ఇచ్చి, కేవలం ఒక్క వికెట్ తీసుకున్నాడు. అది కూడా 20వ ఓవర్లో.. భారీ షాట్ ఆడేందుకు టిమ్ డేవిడ్ ప్రయత్నించడంతో లాంగాన్‌లో ఫీల్డర్‌కు క్యాచ్ లభించింది. ఇలా బౌలింగ్ యూనిట్ మొత్తం విఫలమవడంపై మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు.
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ‘మళ్లీ మళ్లీ చెప్తున్నా.. భువనేశ్వర్ చేత చివరి ఐదు ఓవర్లలో కేవలం ఒక్కసారే ఉపయోగించుకోవాలి’ అని చెప్పాడు. మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా బౌలింగ్‌పై పెదవి విరిచాడు. ‘మరోసారి మన డెత్ బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. ఒత్తిడికి ఇన్నిసార్లు ఎందుకు లోనవుతున్నామో విశ్లేషించి, సమయం దాటిపోకముందే దానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటే మంచిది’అని మిశ్రా ట్వీట్ చేశాడు.
Saying this again use Bhuvi for only one over in last 5 overs.
— Irfan Pathan (@IrfanPathan) September 20, 2022
And our death bowling is exposed again! High time we introspect and correct why are we succumbing under pressure so often. #INDvsAUS
— Amit Mishra (@MishiAmit) September 20, 2022