Rohit Sharma | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రా సైతం మనిషేనని.. ఎప్పుడూ బౌలింగ్ భారాన్ని పూర్తిగా మోయలేడన్నాడు. బుమ్రాకు మద్దతు అందించాల్సిందిగా మిగతా బౌలర్లకు సూచించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. మ్యాచ్‌లో ఓటమికి ఒకరో ఇద్దరిని బాధ్యులను చేయలేమని.. జట్టు మొత్తం విఫలమైందని చెప్పాడు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ ఫెయిల్ అయ్యారని.. అందుకే ఓటమిపాలైందని చెప్పాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ జట్టు కొంప ముంచిందని.. ఎక్కువ పరుగులు చేయలేదనే విషయం తెలుసునన్నాడు.
పెర్త్ టెస్ట్ తరహాలో పరిస్థితి కలిసి వచ్చి పరుగులు సాధిస్తామని అనుకున్నామని.. అలా జరుగలేదని చెప్పాడు. చిన్న విషయానికి టెన్షన్ పడడం లేదని.. భారత కంటే ఆస్ట్రేలియా జట్టు ఆడిందని తెలిపాడు. ఏ ఆటగాడిని ఎలా వాడుకోవాలనేది.. తనకు తెలుసునని.. ఏ ఒక్కరిపై ఆధారపడలేదన్నాడు. జట్టు కూర్పులో వైవిధ్యం ఉండేలా చూసుకున్నామని.. అందరూ బాధ్యత తీసుకొని ఆడితేనే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు. బౌలింగ్ పై స్పందిస్తూ.. ‘జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోలేడు. రెండు ఎండ్ల నుంచి ఒకడే బౌలింగ్ చేస్తాడని ఆశించలేరు. ఇతర బౌలర్లు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే బుమ్రాకు సైతం వికెట్లు పడని రోజులుంటాయి. యువ బౌలర్ హర్షిత్ రాణా 16 ఓవర్లు వేసి 86 పరుగులు ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువ బౌలర్ రాణాను కెప్టెన్ రోహిత్ వెనుకేసుకువచ్చాడు. ఢిల్లీ బౌలర్ గురించి ప్రశ్నించగా.. ఒక టెస్ట్ ఆధారంగా హర్షిత్ రాణాను అంచనా వేయడం సరికాదు. కారణం లేకుండా అతన్ని డ్రాప్ చేయడం మంచిది కాదని అనుకుంటున్నాను. వారికి (ఆసిస్) మంచి ఆటగాడు (ట్రావిస్ హెడ్) ఉన్నాడు.
అతనిపై ఒత్తిడి తెచ్చాడు. రాణా బలమైన అభిరుచి ఉన్న ఆటగాడు. రెండో టెస్ట్‌లో భారత బౌలింగ్ తేలిపోవడంతో మళ్లీ మహ్మద్ షమీని వీలైనంత తర్వగా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ బెంగాల్ బౌలర్ మోకాలు మళ్లి వాచిపోయిందని రోహిత్ తెలిపాడు. ‘షమీ కోసం జట్టు తలుపులు తెరిచే ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న సమయంలో మోకాలు మళ్లి వాచిపోయింది. అతనిపై నిఘా వేసి ఉంచాం. షమీపై ఒత్తిడి పెంచొద్దనుకుంటున్నాం’ అని రోహిత్ తెలిపాడు. ఇక ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ వివాదం వివాదంపై ప్రశ్నించగా.. పెద్దగా స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. సిరాజ్ బాగా బౌలింగ్ చేశాడని చెప్పారు. సిరాజ్‌ను సమర్థిస్తూ.. మైదానంలో దూకుడుగా ఉండడానికి.. దుందుడుకుగా ఉండడానికి చాలా తేడా ఉందని చెప్పాడు. కెప్టెన్‌గా ఎవరూ గీత దాటకుండా చూడడం తనపని పని చెప్పాడు. కొన్నిసార్లు మాటల యుద్ధం జరగవచ్చని.. జట్టు కోసం ఏం చేయాలో సిరాజ్‌కు తెలుసని.. అవసరమైన ప్రతిదాన్ని చేస్తాడని పేర్కొన్నాడు.