బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్‌లో రసవత్తర పోరు సాగుతున్నది. పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై వికెట్ల వేట ముగియగా, పరుగుల వరద మొదలైంది. భారత బౌలింగ్ ధాటికి కంగారూలు కుదేలైన మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రాహుల్ అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఆసీస్ బౌలింగ్ దాడిని అంతే దీటుగా తిప్పికొడుతూ భారత్‌ను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళుతున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన జైస్వాల్.. కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆసీస్ గడ్డపై ఆడుతున్నది తొలిసారే అయినా తొణుకు బెణుకు లేకుండా అలవోకగా పరుగులు కొల్లగొడుతున్నాడు. మూడో రోజు ఇదే జోరు కొనసాగిస్తే ఆసీస్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించినట్లే. కెప్టెన్ బుమ్రా పాంచ్ పాటాకాతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్ సతాయించినా..ఆసీస్ ఆటలు కొనసాగలేదు.
పెర్త్: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఊహించని మలుపులతో కొనసాగుతున్నది. పేస్ బౌలింగ్‌కు అచ్చొచ్చిన పెర్త్ పిచ్ అనూహ్యంగా స్పందిస్తున్నది. తొలి రోజు ఇరు జట్ల పేసర్లు 17 వికెట్లతో పండుగా చేసుకుంటే రెండో రోజు ఆట అందుకు భిన్నంగా సాగింది. కేవలం మూడంటే మూడు వికెట్లు పడగా, 209 పరుగులు వచ్చాయి. మరీ మూడు రోజులు మిగిలున్న టెస్టులో బంతి ఎలా స్పందిస్తునేది ఆసక్తికరంగా మారింది. 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(193 బంతుల్లో 90 నాటౌట్, 7ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 62 నాటౌట్, 4ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలతో రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఇద్దరు ఆసీస్ బౌలింగ్ దాడిని ఎదురొడ్డి నిలుస్తూ పరుగులు సాధించారు. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 218 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతున్నది. 300 నుంచి 400ల మధ్య ఆసీస్ ముందు లక్ష్యాన్ని ఉంచితే మ్యాచ్‌పై మనం పూర్తి పట్టు సాధించినట్లే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 67/7తో రెండో రోజు ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..104 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ స్టార్క్(112 బంతుల్లో 26, 2ఫోర్లు) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. క్యారీ(21), లియాన్(5), హేజిల్‌వుడ్(7 నాటౌట్) కలిసి క్రీజులో అతుక్కుపోయాడు. ఏకంగా 18 ఓవర్ల పాటు టీమ్ఇండియా బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కెప్టెన్ బుమ్రా(5/30) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనంలో కీలకమయ్యాడు.
బుమ్రా పాంచ్ పటాకా:
రెండో రోజు ఆటలోనూ బుమ్రా తన పేస్ ప్రతాపాన్ని కొనసాగించాడు. ఆదిలోనే క్యారీని ఔట్ చేసిన బుమ్రా..ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. అయితే మరో ఎండ్‌లో స్టార్క్ అడ్డుగోడగా నిలిచాడు. లోయార్డర్ బ్యాటర్లతో కలిసి టీమ్ఇండియా బౌలర్లకు పరీక్ష పెట్టాడు.
జైస్వాల్, రాహుల్ అదుర్స్
Rahul
తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ జైస్వాల్ మలి ఇన్నింగ్స్‌లో చెలరేగగా, రాహుల్ తన అనుభవాన్ని చాటాడు. వీరిద్దరు ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా ఆసీస్ బౌలింగ్ దాడిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న ముంబైకర్ జైస్వాల్ మెరుగైన పరిణతి కనబరిచాడు. ఓవైపు మంచి బంతులను గౌరవిస్తూనే కళాత్మక షాట్లతో అలరించాడు. సంప్రదాయక టెస్టు క్రికెట్ షాట్లకు పెద్దపీట వేస్తూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో జైస్వాల్ పెర్త్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యానికి పునాదులు వేశాడు. ఈ క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు(34) రికార్డుతో పాటు రాహుల్‌తో కలిసి అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఒకానొక దశలో ఆసీస్ బౌలర్లను వీరిని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ప్రధాన పేస్ అస్త్రం స్టార్క్‌ను ఓ వైపు కవ్వించిన జైస్వాల్..లియాన్‌ను అంతే అలవోకగా అరుసుకున్నాడు. లియాన్ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో జైస్వాల్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒక దశలో జైస్వాల్ ఆట చూసి స్టార్క్ ఆశ్చర్యపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ అనుభవంతో ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను అంతే జాగ్రత్తగా వదిలిపెట్టిన రాహుల్ సూపర్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తన ఎంపిక కరెక్ట్ అనే టీమ్ మేనేజ్మెంట్కు సంకేతాలు పంపాడు. ఇలా ఇద్దరు పోటీపడి క్రీజులో కుదురుకోవడంతో కంగారూ బౌలర్ల ఆటలు సాగలేదు. ముఖ్యంగా టీ సెషన్ తర్వాత జైస్వాల్, రాహుల్ కలిసి 31 ఓవర్లలో 88 పరుగులు చేసి తమ డిఫెన్స్ ఎలా ఉందో చూపెట్టారు.
క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు
జైస్వాల్ : (34)-2024
మెక్కల్లమ్ : (33)-2014
స్టోక్స్ : (26)-2022
2 పెర్త్‌లో భారత్‌పై ఆస్ట్రేలియాకు ఇదే రెండో అత్యల్ప స్కోరు(104). 1981లో ఆసీస్ 83 పరుగులకు ఆలౌటైంది.
9 ఆసియా బయట టెస్టుల్లో ఐదేసి వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 9వ సారి. కపిల్‌దేవ్ సరసన బుమ్రా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్(స్టార్క్ 26, క్యారీ 21, బుమ్రా 5/30, రానా 3/48), భారత్ రెండో ఇన్నింగ్స్: 172/0
(జైస్వాల్ 90 నాటౌట్, రాహుల్ 62 నాటౌట్)