అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై టీమిండియా విజృంభించి ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74), కేఎల్ రాహుల్ (69) చెలరేగి ఆడారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (13 బంతుల్లో 27 నాటౌట్), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్) దుమ్మురేపారు. బ్యాట్స్‌మెన్ అందరూ అదరగొట్టడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్ చేయడానికి రాకపోవడం గమనార్హం. 15వ ఓవర్లో రోహిత్ వికెట్ పడిన తర్వాత హార్డ్ హిట్టర్ల అవసరం ఉందని గ్రహించిన టీమిండియా.. పంత్‌ను రంగంలోకి దింపింది. ఆ తర్వాత రాహుల్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యాను బరిలో దింపారు. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.