ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా.. పసికూన యూఏఈపై భారీ విజయంతో టోర్నీని ఆరంభించింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 18 ఓవర్లలోనే ముగిసిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సూర్యకుమార్ సేన.. యూఏఈని 57 పరుగులకే కట్టడి చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే దంచేసింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ మాయకు తోడు చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపులతో భారత్ అలవోకగా విజయం సాధించింది.
దుబాయ్: ఆసియా కప్‌లో తొమ్మిదో టైటిల్ వేటను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. బుధవారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత స్పిన్నర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో అలీషాన్ షరాఫు (17 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్స్), మహమ్మద్ వసీం (19, 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. కుల్దీప్ యాదవ్ (4/7) స్పిన్ మాయకు యూఏఈ కుదేలైంది. శివమ్ దూబే (3/4), వరుణ్ చక్రవర్తి (1/4), అక్షర్ పటేల్ (1/13) రాణించారు. అనంతరం నామమాత్రపు ఛేదనను టీమ్ఇండియా.. 4.3 ఓవర్లలోనే దంచేసింది. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20*, 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండు ఇన్నింగ్స్‌లూ కలిపి మ్యాచ్ రెండు గంటల్లోపే ముగియగా.. 106 బంతుల్లోనే ఖేల్ ఖతమవ
డం కొసమెరుపు.
నామమాత్రపు లక్ష్యాన్ని భారత్ 27 బంతుల్లోనే ఊదేసింది. యువ సంచలనం అభిషేక్ శర్మ.. షేకుల అడ్డా అయిన దుబాయ్‌లో యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హైదర్ అలీ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే సిక్సర్‌తో ఛేదనను ఆరంభించిన అతడు.. ధ్రువ్ 3వ ఓవర్లో 6,4 బాదాడు. రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్‌కు జతగా వచ్చిన టెస్టు సారథి గిల్ కూడా రెండో ఓవర్లో 4, 6తో ఛేదనను మరింత సులభం చేశాడు. జునైద్ ఓవర్లో డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ దిశగా సిక్స్ కొట్టినా.. గెలుపునకు పది పరుగుల దూరంలో అతడు నిష్క్రమించాడు. కెప్టెన్ సూర్య (7*).. గిల్‌తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
సుమారు ఏడు నెలల విరామం (భారత్ చివరిసారి ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడింది) తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న భారత్.. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. పసికూన యూఏఈపై పెద్దగా ఆశలేమీ లేకపోయినా ఆ జట్టు బ్యాటర్లు కనీసం నామమాత్రపు లక్ష్యాన్నైనా భారత్ ఎదుట ఉంచుతారని ఆశించిన యూఏఈ అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్లు షరాఫు, కెప్టెన్ వసీమ్ మినహా మిగిలినవారెవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. హార్దిక్ వేసిన తొలి ఓవర్లోనే షరాఫు రెండు బౌండరీలతో పది పరుగులు రాబట్టి జోరు మీద కనిపించాడు. బుమ్రా (1/19) ఓవర్లోనూ బౌండరీ కొట్టిన అతడు.. అక్షర్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ కవర్ డ్రైవ్‌తో సిక్సర్ సాధించాడు. కానీ నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్‌కు షరాఫు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. వన్‌డౌన్ బ్యాటర్ జొహెబ్ను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో వసీమ్.. మూడు బౌండరీలు బాదాడు. మ్యాచ్‌లో యూఏఈ అభిమానులకు అవే చివరి సంతోష క్షణాలతో పాటు ఆ జట్టుకు దక్కిన చివరి బౌండరీ కూడా అదే..
8 ఓవర్లు ముగిసేసరికి 47/2తో యూఏఈ కాస్త మెరుగ్గానే కనిపించింది. కానీ 9వ ఓవర్లో కుల్దీప్.. మొదటి బంతికి రాహుల్ చోప్రా (3)ను ఔట్ చేయగా నాలుగో బాల్‌కు వసీమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆరో బంతికి హర్షిత్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11వ ఓవర్లో అసిఫ్.. దూబె బౌలింగ్‌లో శాంసన్ చేతికి చిక్కగా అక్షర్ పటేల్ ఓవర్లో సిమ్రన్‌జీత్ లెగ్‌బిఫోర్‌గా పెవిలియన్ చేరాడు. దూబె 13వ ఓవర్లో ద్రువ్ (1), జునైద్ (0)ను ఔట్ చేశాడు. కుల్దీప్ 14వ ఓవర్లో హైదర్ అలీ (1)ని ఔట్ చేసి యూఏఈ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 8 ఓవర్లకు 47/2తో ఉన్న యూఏఈ.. 13.1 ఓవర్‌కు 57 రన్స్‌కు కుప్పకూలింది. 10 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లను కోల్పోవడం గమనార్హం.
1 టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగవంతమైన (బంతులపరంగా) విజయం.
యూఏఈ : 13.1 ఓవర్లలో 57 ఆలౌట్ (షరాఫు 22, వసీమ్ 19, కుల్దీప్ 4/7, దూబె 3/4);
భారత్: 4.3 ఓవర్లలో 60/1 (అభిషేక్ 30, గిల్ 20*, సిద్ధిఖీ 1/16)