కటక్ : సొంతగడ్డపై వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు.. మెగా టోర్నీ ప్రయాణాన్ని ఘనవిజయంతో ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా.. 101 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. బ్యాట్‌తో టాపార్డర్ నిరాశపరిచినా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అతడి మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 175/6 స్కోరు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో 12.3 ఓవర్లలో 74 రన్స్‌కే తోకముడిచింది. అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఈనెల 11న ముల్లాన్‌పూర్‌లో జరుగుతుంది.
48/3. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ పవర్ ప్లేలో చేసిన స్కోరిది. టెస్టు, వన్డే సారథి శుభ్‌మన్ గిల్ (4), టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12)తో పాటు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (17) తీవ్రంగా నిరాశపరిచారు. ఎంగిడి వరుస ఓవర్లలో షాకులివ్వడంతో టీమ్ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఈ దశలో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (26), అక్షర్ (23) కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 30 రన్స్ జోడించినా వేగంగా ఆడలేకపోయారు. అయితే 12వ ఓవర్లో తిలక్ ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్.. ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మహారాజ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతడు.. నోకియా బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు. అక్షర్ నిష్క్రమించినా ఆఖర్లో దూబె (11), జితేశ్ శర్మ (10*)తో కలిసి భారత్‌కు భారీ స్కోరునందించాడు. సిపమ్ల ఓవర్లో అతడు 18 పరుగులు రాబట్టగా నోకియా ఆఖరి ఓవర్లోనూ 12 రన్స్ వచ్చాయి.
ఛేదనలో తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయిన సఫారీలు.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అర్ష్‌దీప్ వరుస ఓవర్లలో డికాక్, స్టబ్స్‌ను ఔట్ చేసి సౌతాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలెట్టగా స్పిన్నర్లు అక్షర్ (2/7), వరుణ్ (2/19) రాకతో సఫారీ బ్యాటర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆరో ఓవర్లో బంతినందుకున్న అక్షర్.. తొలి బంతికే సఫారీ సారథి మార్క్మ్ (14)ను బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో మిల్లర్ (1)ను హార్దిక్ బోల్తా కొట్టించగా వరుణ్.. ఫెరీరా (5)ను పెవిలియన్‌కు పంపాడు. యాన్సెన్ (12)ను వరుణ్ పదో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేయగా బుమ్రా ఒకే ఓవర్లో బ్రెవిస్ (22), మహారాజ్‌ను ఔట్ చేసి సఫారీల ఓటమిని ఖరారుచేశాడు. దూబే 13వ ఓవర్లో సిపమ్ల (2)ను ఔట్ చేసి లాంఛనాన్ని పూర్తిచేశాడు.

1 ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ వికెట్ తీయడం ద్వారా టీ20ల్లో వంద వికెట్ల ఘనతను పూర్తిచేసిన బుమ్రా.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
1 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు.
భారత్: 20 ఓవర్లలో 175/6 (హార్దిక్ 59*, తిలక్ 26, ఎంగిడి 3/31, సిపమ్ల 2/38);
దక్షిణాఫ్రికా: 12.3 ఓవర్లలో 74 ఆలౌట్ (బ్రెవిస్ 22, స్టబ్స్ 14, అక్షర్ 2/7, అర్ష్‌దీప్ 2/14)