దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. హైదరాబాదీ తిలక్‌వర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్-ఎ మంగళవారం ఉత్కంఠగా సాగిన తొలి పోరులో 8 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. తొలుత వైస్ కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్(114 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్స్‌లతో 101) సెంచరీకి తోడు కెప్టెన్ తిలక్ ( 60) అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 277/6 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌సింగ్(2)తో పాటు ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (14) ఫెయిలవగా.. ప్రియాంశ్ ఆర్య (32) ఫర్వాలేదనిపించాడు.
ఓదశలో 69/3తో నిలిచిన జట్టును రుతురాజ్, తిలక్ నాలుగో వికెట్‌కు 150 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన లంక-ఏ జట్టు 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి 12 బంతుల్లో 10 పరుగులు అవసరమైన దశలో అర్షద్‌ఖాన్ (2/24).. విజయ్‌కాంత్ (5), షిరాజ్ (0)ను ఔట్ చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. లంక కెప్టెన్ సహాన్ ఆరాచిగె(74) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రుతురాజ్‌కు ‘ప్లేయర్ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్-ఏ తలపడనుంది.