
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్.. తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ‘మంకీగేట్’ వివాదంలో తన మతాన్ని కించపరిచారని షాకింగ్ విషయం వెల్లడించిన అతను.. ఆ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
దీంతో అప్పటి టీమిండియా సారధి ధోనీకి, భజ్జీకి మధ్య గొడవలు ఉన్నాయనే వదంతులు వ్యాపించాయి. దీనిపై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో భజ్జీ స్పందించాడు. తన అసంతృప్తి ధోనీతో కాదని, బీసీసీఐతో అని స్పష్టంచేశాడు.
‘2012 తర్వాత భారత క్రికెట్లో వచ్చిన మార్పులను మరింత బాగా హ్యాండిల్ చేయాల్సింది. సెహ్వాగ్, నేను, యువరాజ్, గంభీర్ అందరూ దేశం కోసం ఆడుతూ రిటైర్ అవ్వాల్సిన వాళ్లం. ఎందుకంటే వీళ్లందరూ ఐపీఎల్లో ఆడుతూనే ఉన్నారు. అసలు చూడండి, 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టంతా కలిసి మళ్లీ ఎప్పుడూ ఆడేలేదు. ఎందుకు? వాళ్లలో చాలా కొంతమంది మాత్రమే 2015 ప్రపంచకప్ ఆడారు. ఎందుకిలా?’ అని భజ్జీ ప్రశ్నించాడు.

ధోనీతో గొడవ గురించి మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని, అయితే ధోనీతో నాకు పెళ్లి కాలేదు’ అంటూ జోకులేశాడు. ధొనీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో భజ్జీ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ టోర్నీ విజేతలుగా నిలిచారు.
బీసీసీఐ, సెలెక్టర్లతోనే తనకు సమస్యని, ఈ విషయంలో ఒకసారి తానను సెలెక్టర్లను నేరుగా ప్రశ్నించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. గొప్పవాళ్లందరూ ఇంకా ఫామ్‌లో ఉండగా కొత్తవాళ్లను తీసుకొచ్చి జట్టును ఎందుకు విడగొడుతున్నారని అడగ్గా.. అది తమ చేతుల్లో లేదని సెలెక్టర్లు బదులిచ్చారని హర్భజన్ చెప్పాడు.
అలాంటప్పుడు వాళ్లు సెలెక్టర్లు ఎందుకయ్యారు? అని ప్రశ్నించిన ఈ ఆఫ్ స్పిన్నర్.. అప్పటి సెలెక్టర్లు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశాడు.