గువహతి: క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేందుకు మరో ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు నేడు (మంగళవారం) తెరలేవనుంది. నేటి (సెప్టెంబర్ 30) నుంచి గువహతి వేదికగా మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ 34 రోజుల పాటు సాగి నవంబర్ 2తో ముగుస్తుంది. 13వ ఎడిషన్‌గా సాగనన్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) టైటిల్ కోసం తలపడనున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఒక జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ దశ ముగిశాక టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
అక్టోబర్ 29, 30న సెమీస్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా నవంబర్ 2న ఫైనల్ జరుగుతుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఒకవేళ పాక్ గనక సెమీస్‌తో పాటు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లను కొలంబోలోనే నిర్వహించనున్నారు. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతాయి. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య గువహతిలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కొలంబో వేదికగా అక్టోబర్ 05న టీమ్ఇండియా తమ రెండో మ్యాచ్ ఆడనుంది.
పురుషుల క్రికెట్లో పలుమార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు మహిళల క్రికెట్లో మాత్రం ఒక్కసారి కూడా ఆ ఘనతను సాధించలేకపోయింది. 2005, 2017 ప్రపంచకప్‌లలో ఫైనల్స్ చేరినా తుది మెట్టు వద్ద తడబడి టైటిల్స్ కోల్పోయింది. కానీ గతంతో పోల్చితే భారత మహిళల క్రికెట్ జట్టు ఎంతో మెరుగైంది. స్వదేశంలో చరిత్ర సృష్టించడానికి మన అమ్మాయిలకు ఇది సువర్ణావకాశం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పుణ్యమా అని యువ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు.
దాదాపు కెరీర్ చివరి దశలో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈ టోర్నీ ఎంతో కీలకం. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన హర్మన్.. ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రిచా ఘోష్, ప్రతీక రావల్ వంటి స్టార్లతో భారత్ మెరుగ్గానే కనిపిస్తున్నది. సొంతగడ్డపై ఆడుతుండటం హర్మన్‌ప్రీత్ సేనకు సానుకూలాంశం కాగా కీలక మ్యాచ్‌లలో ఒత్తిడికి తలొగ్గే సమస్య నుంచి బయటపడితేనే భారత్ టైటిల్ ఆశలు నెరవేరుతాయి.