ICC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా జైషా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ఆయన ఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఆయన 16 మంది బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ భేటీలో ఛాంపియన్స్ ట్రోఫీకి పెద్దగా ప్రాధాన్యం ఉండదని.. కొత్త అధ్యక్షుడిని పరిచయం చేసేందుకు ఈ సమావేశం అజెండా రూపొందించినట్లు తెలుస్తున్నది. ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఇప్పటికే పాక్ తన అభిప్రాయాన్ని ఐసీసీకి చెప్పింది. గతంలో పీసీబీ తన స్టాండ్‌ని మార్చుకొని.. హైబ్రిడ్ మోడల్‌కు షరతులతో కూడిన అంగీకారం తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ.. రాబోయే రోజుల్లో ఐసీసీ టోర్నీలను సైతం హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఐసీసీలో 12 దేశాలు పూర్తి సభ్యు దేశాలు, మరో అసోసియేట్ సభ్య దేశాలు పీసీబీ డిమాండ్‌ని తిరస్కరించాయి.
ఐసీసీ బోర్డులో ఓ మహిళా ప్రతినిధి సైతం ఉన్నారు. గతంలో జరిగిన ఈ సమావేశానికి ఆమె హాజరుకాలేదు. అయితే, పాక్ పరిస్థితిపై ఎలాంటి రాతపూర్వక హామీని ఇచ్చేందుకు ఐసీసీ వాటాదారులందరూ నిరాకరించారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీపై చర్చిస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ విషయంలో పాకిస్థాన్ మాట్లాడేందుకు ఏమీ లేదని.. బోర్డు సభ్యులు చెప్పిందే అంగీకరించాల్సిందేనన్నారు. భవిష్యత్ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లకూడదన్న డిమాండ్‌పై పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తే.. ఐసీసీకి రెండు అవకాశాలున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ లేకుండా మరో చోట నిర్వహించడం. పాక్ జట్టు స్థానంలో మరో జట్టును తీసుకోవడం. రెండో అవకాశం ఏంటంటే.. టోర్నీని వాయిదా వేసి.. మరో వెండోలో నిర్వహించడం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ మధ్య కొత్త విండోను గుర్తించడం అంత సులభం కానందున.. ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయడమే. టోర్నీని రద్దు చేస్తే ఐసీసీకి నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాక్‌లో స్టేడియాల పునరుద్ధరణ పనులు చేపట్టింది. అదే సమయంలో పాక్‌కు పరాభవమేనని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.