ICC U19 World Cup 2024: అండర్ – 19 వరల్డ్ కప్ వేటను భారత్ విజయంతో ఆరంభించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత్.. మొదటి పోరులో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సౌమి పాండే.. నాలుగు వికెట్లు (4/24) రాణించాడు. ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.
మోస్తారు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు అషికర్ రెహ్మన్ (14), జైషన్ అలమ్ (14) లు 8 ఓవర్ల లోపే ఔట్ అయ్యారు. చౌదరి రిజ్వాన్ డకౌట్ అయ్యాడు. అహ్రర్ అమిన్ (5) సైతం అలా వచ్చి ఇలా వెళ్లాడు. 12 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.
India overcome an ordinary start to secure a comprehensive win over Bangladesh 🔥#U19WorldCup #BANvIND pic.twitter.com/bceOWG5PMR
— ICC (@ICC) January 20, 2024
50కే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మద్ రెహ్మన్ (54), అరిఫుల్ ఇస్లాం (41) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీయడంతో బంగ్లా పతనం మళ్లీ మొదలైంది. అరిఫుల్ నిష్క్రమించాక వచ్చిన బ్యాటర్లలో షేక్ పేవేజ్ (15 నాటౌట్) తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. ఈ టోర్నీలో తర్వాతి మ్యాచ్‌ను భారత్.. ఈనెల 25న ఐర్లాండ్‌తో ఆడనుంది. అంతకుముందు భారత్.. ఆదర్శ్ సింగ్ (76), ఉదయ్ సహరన్ (64)లు రాణించడంతో టీమిండియా గట్టెక్కింది.