Dhandoraa | గ్రామీణ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారన్న విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలో తెలంగాణ సంస్కృతి, సామాజిక అంశాల కలబోతగా వస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో విడుదల చేస్తుండటం సినిమాపై మరింత అంచనాలను పెంచింది. విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. సుమారు 200కు పైగా థియేటర్లలో ప్రదర్శితం కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి, ఈ నెల 23నే అక్కడ ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా వారం కూడా లేకపోవడంతో తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
గ్రామాల్లో ఇంకా కులం అడ్డుగోడలు తొలగిపోలేదని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రారంభంలోనే ఊరి బయట శవాన్ని మోసుకెళ్తున్న దృశ్యాలు, “మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..” అనే డైలాగ్ ఈ సినిమాలో ఉన్న సామాజిక కోణాన్ని ఎత్తి చూపుతోంది. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మానికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. మార్క్ కె. రాబిన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణ మట్టి వాసనతో కూడిన కథలను ఇష్టపడే వారికి ‘దండోరా’ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.