Nagakesari Plant | ఆసియా దేశాలల్లో ఎక్కువగా కనిపించే అలంకార వృక్షాలల్లో నాగకేసరి మొక్క కూడా ఒకటి. దీనిని నాగకేసరి, నాగకేరములు, గజ కేసర, నాగచంప, తగునాగర వంటి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందంతో పాటు ఈ మొక్క ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయోల్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. జలుబు, దగ్గు, కఫం, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు, రక్తమొలలు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో నాగకేసరి మొక్క మనకు ఎంతగానో దోహదపడుతుంది.
అజీర్ణం సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక గిన్నెలో అర టీ స్పూన్ నాగకేసరి పొడిని తీసుకుని అందులో తేనె లేదా గోరు వెచ్చని నీరు వేసి కలపాలి. తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అలాగే తరుచూ జ్వరం బారిన పడే వారు నాగకేసరి మొక్కను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పావు టీ స్పూన్ నాగకేసరి పొడిని తేనె లేదా గోరువెచ్చని నీటితో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆహారం తీసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల జ్వరం చాలా సులభంగా తగ్గుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత మాత్రమే తీసుకోవాలి.
రక్తమొలల సమస్యతో బాధపడే వారికి నాగకేసరి ఎంతగానో ఉపయోగపడుతుంది. పావు టీ స్పూన్ లేదా అర టీస్పూన్ నాగకేసరి పొడిలో తేనె వేసి కలపాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. దీనిని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రక్తమొలల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కఫ దోషాలను నివారించడంలో కూడా నాగకేసరి మనకు సహాయపడుతుంది. నాగకేసరి పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దీనిలో తేనె లేదా గోరువెచ్చని నీరు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులల్లో శ్లేష్మం ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ విధంగా నాగకేసరి మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, షుగర్ వ్యాధి గ్రస్తులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ చూర్ణాన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని వారు చెబుతున్నారు.