న్యూయార్క్: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. ఆ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడలు (Air Strikes) చేసింది. ఇటీవల అమెరికా సిబ్బందిపై సిరియా దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఓ అధికారి తెలిపారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో ఉన్న అమెరికా సైనిక సిబ్బందిపై దాడి చేశారని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించారు.
ఐఎస్ఐఎస్ ఫైటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయుధ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా డిఫెన్స్ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు. ఆపరేషన్ హాక్ఐలో భాగంగా ఆ దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. ఇదేమీ యుద్ధం కాదు అని, ఇది కేవలం ప్రతీకారం మాత్రమే అని ఆయన అన్నారు. మా శత్రువులను వేటాడామని, వాళ్లను చంపేశామని అన్నారు. ఈ దాడుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సెంట్రల్ సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్కు చెందిన అనేక టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ఇద్దరు అమెరికా అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ సిరియాలోని పల్మైరాలోఉన్న దళాలపై జరిపిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఓ ఇంటర్ప్రిటర్ మరణించారు. అమెరికా దళాలకు చెందిన సుమారు వెయ్యి మంది సైనికులు ఇంకా సిరియాలోనే ఉన్నారు.