న్యూఢిల్లీ: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా మధ్య జూన్ 1న జరగనున్న మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా దాయాదులు న్యూయార్క్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసింది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గత వరల్డ్‌కప్‌లో 16 జట్లు పాల్గొనగా.. ఈసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. మొత్తం టీమ్‌లను 4 గ్రూప్‌లుగా విభజించారు. పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికాతో కలిసి భారత్ గ్రూప్-‘ఏ’లో ఉంది. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో ఆరు వేదికల్లో 55 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జూన్ 29న బార్బడోస్‌లో తుది పోరు జరగనుంది. గ్రూప్ దశలో భారత్.. జూన్ 5న ఐర్లాండ్‌తో, 9న పాకిస్థాన్‌తో, 12న అమెరికాతో, 15న కెనడాతో టీమ్ఇండియా తలపడనుంది.
