ICC T20 Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా యువ బ్యాటర్స్ అభిషేక్ శర్మ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ తనదైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దాంతో నెంబర్ వన్ బ్యాటర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మరో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ మూడోస్థానంలో ఉన్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రెండోస్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్, నాలుగో స్థానంలో నిస్సంక (శ్రీలంక), నాలుగో స్థానంలో జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ఆరోస్థానంలో ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఏడోస్థానంలో టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), తొమ్మిద స్థానంలో కుషాల్ పెరీరా (శ్రీలంక), పదో స్థానంలో మిచేల్ మార్ష్ (ఆస్ట్రేలియా) ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. కెప్టెన్ బాబార్ ఆజం తొమ్మిదిస్థానాలు మెరుగుపరుచుకొని 30వ స్థానానికి చేరుకున్నాడు. సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా పదిస్థానాలు ఎగబాకి 39, 54 స్థానాలకు చేరారు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 12వ స్థానానికి, బంగ్లాదేశ్‌కు చెందిన టాంజిద్ హసన్ 17వ స్థానానికి, ఆఫ్ఘనిస్తాన్ ద్వయం రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ వరుసగా 15, 20వ స్థానాల్లో ఉన్నారు. ఇక టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ రెండుస్థానాలు మెరుగుపరుచుకొని 10వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహమాన్, మహేది హసన్ 14, 17వ స్థానానికి చేరుకున్నారు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్ 23, 38వ స్థానానికి చేరుకున్నారు.
పాక్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ 15 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు ర్యాంకులు దిగజారి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో పాక్ ఆటగాడు ఆయుబ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. జింబాబ్వే ప్లేయర్స్ సికందర్ రజా, వెస్టిండిస్ ప్లేయర్ రోస్టన్ చేజ్ వరుసగా రెండు, మూడో స్థానాలకు చేరుకున్నారు. టీ20ల్లో రజా 33 బంతుల్లో చేసిన సెంచరీతో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హర్దీక్ పాండ్యా రెండు ర్యాంకులు దిగజారి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అలాగే, అక్సర్ పటేల్ నాలుగు ర్యాంకులు దిగజారి 170 పాయింట్లతో 15వ స్థానానికి చేరాడు. అభిషేక్ శర్మ 16వ స్థానంలో ఉన్నాడు.