T20 World Cup 2024 : పురుషుల టీ20 వరల్డ్ కప్ ముగిసి నెల కావోస్తోంది. పొట్టి ఫార్మాట్ శైలికి విరుద్దంగా బౌలర్ల పాలిట వరమైన ఈ టోర్నీని పవర్ హిటర్లు కలలో కూడా మర్చిపోవడం లేదు. ముఖ్యంగా అనూహ్యంగా బౌన్స్ అయిన అమెరికా పిచ్‌లు గుర్తొస్తే చాలు బ్యాటర్లు ఉలిక్కి పడుతున్నారు. తాజాగా టీ20 వరల్డ్ కప్ పిచ్‌ల రేటింగ్స్ (Pitch Ratings) వచ్చాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ కోసం బ్రియాన్ లారా స్టేడియంలో వాడిన పిచ్ ‘అధ్వాన్నం’గా (Unsatisfactory) ఉందని ఐసీసీ తెలిపింది.
లీగ్ దశ మ్యాచ్‌లకు వేదికైన నిస్సావు కౌంటీ స్టేడియం పిచ్ సైతం చాలా ‘చెత్త పిచ్’ అని రిపోర్టు తేల్చేసింది. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన న్యూయార్క్ పిచ్ మాత్రం ‘సంతృప్తికరంగా’ (Satisfactory)నే ఉందని ఐసీసీ నివేదిక చెప్పింది. నస్సావు కౌంటీ స్టేడియంలో తొలుత ఆడిన టీమిండియా 119 రన్స్‌కే ఆలౌట్ అయింది.
స్వల్ప ఛేదనలో గెలుపు దిశగాసాగిన పాక్ అనూహ్యంగా తడబడింది. ఒకదశలో 88 5తో పటిష్ఠ స్థితిలో ఉన్న బాబర్ సేనను పేసర్ బుమ్రా (3/14)వణికించాడు. సంచలన బౌలింగ్‌తో దాయాది బ్యాటర్లను డగౌట్‌కు చేర్చాడు. దాంతో, రోహిత్ సేన 6 పరుగులతో గెలిచింది.
కృత్రిమ పిచ్
తొలిసారి ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న అమెరికా రెండు నెలల సమయంలోనే హడావిడిగా తాత్కాలిక స్టేడియాలు, కృత్రిమ పిచ్‌లు నిర్మించింది. కానీ, పిచ్‌ల నాణ్యత, స్టేడియాల్లో ఆటగాళ్లకు వసతులను మాత్రం అమెరికా క్రికెట్ పట్టించుకోలేదు. పూర్తిగా బౌలర్లకు సహకరించే పిచ్‌లు తయారు చేసిన నిర్వాహకులు టీ20 మజాను అభిమానులకు దూరం చేశారు.
అమెరికాలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తప్పిస్తే అన్నీ స్కోరింగ్ మ్యాచ్‌లే. ఇక జస్ప్రీత్ బుమ్రా(భారత్), అన్రిచ్ నోకియా(దక్షిణాఫ్రికా), సౌరభ్ నేత్రావల్కర్(యూఎస్ఏ) వంటి పేసర్లు అయితే అదనపు బౌన్స్ ఆయుధంగా పెట్రేగిపోయారనుకోండి. దాంతో, చెత్త పిచ్‌లు తయారు చేశారంటూ అమెరికా క్రికెట్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు పిచ్ రేటింగ్స్ ద్వారా వరల్డ్ కప్ నిర్వహణలో అమెరికా అట్టర్ ఫ్లాప్ అయిందనేది స్పష్టమైంది.