Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసిన నేపథ్యంలో నవంబర్ 11న జరగాల్సిన మెగా టోర్నీ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. దాంతో, అసలు ఏం జరుగుతోందో? తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనిశ్చితికి తెరదించే ప్రయత్నాల్లో మునిగిన ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈసారి చాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే హైబ్రిడ్ మోడల్ ఒక్కటే మార్గమని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ అందుకు కూడా పీసీబీ అంగీకరించకంటే వేదికను తరలించేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాశ్లో అల్లర్ల కారణంగా మహిళల టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈలో జరిపినట్టే.. చాంపియన్స్ ట్రోఫీ వేదికను దక్షిణాఫ్రికాకు తరలించే ఆలోచనలో ఉంది ఐసీసీ. ఒకవేళ అదే జరిగితే సొంతగడ్డపై పూర్తి స్థాయిలో ఐసీసీ ట్రోఫీ జరిపి తీరాలనుకుంటున్న పీసీబీకి దిమ్మదిరిగే షాక్ తగిలినట్టే.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరగాలి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకూ సాగే టోర్నీ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ, భద్రత కారణాల రీత్యా భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించడం తప్ప మరో దారి కనిపించడం లేదు.
అయితే.. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) స్పందించాడు. నఖ్వీ మీడియాతో మాట్లాడిన రెండు రోజులకే హైబ్రిడ్ మోడల్‌కే తాము మొగ్గు చూపుతున్నామంటూ ఐసీసీ సంకేతాలివ్వడం విశేషం.