Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 821 పాయింట్ల పతనంతో 79,496.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 79,820.98 పాయింట్ల నుంచి 78,547.84 పాయింట్ల మధ్య తచ్చాడింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 257.85 పాయింట్ల నష్టంతో 23,883.45 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 24,242 నుంచి 23.839.15 పాయింట్ల మధ్య తచ్చాడింది.
ఎన్ఎస్ఈ -50లో 46 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బ్రిటానియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర 7.30 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు ట్రెంట్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ 0.42 శాతం వరకు లబ్ధి పొందాయి. ఎన్ఎస్ఈ స్మాల్ క్యాప్ -100 1.28 శాతం, ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్-100 1.07 శాతం నష్టపోయాయి. మరోవైపు బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.26 శాతం, బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.98 శాతం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో 27 స్టాక్స్ పతనం అయ్యాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి.