Srilanka Cricket Board : అంతర్జాతీయ క్రికెట్లో నిషేధానికి గురైన శ్రీలంక క్రికెట్ బోర్డు(SLB)పై ఐసీసీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ మధ్యే లంకలో పర్యటించిన ఐసీసీ సీఈఓ జెఫ్ అల్లార్డిసే(Jeff Allardice) లంక బోర్డును పునరుద్దరిస్తామని సంకేతాలు ఇచ్చాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wikremesnghe), క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో(Harin Fernando) తో మాట్లాడిన అల్లార్డిసే ‘నిర్మాత్మక చర్చలు’ జరిగాయని తెలిపాడు. మార్చిలో ఐసీసీ బోర్డు సమావేశంలో లంక బోర్డు రద్దు ఎత్తివేతపై నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘అల్లార్డిసేతో చర్చలు సంతృప్తికరంగా సాగాయి. లంక బోర్డుకు మంచి రోజులు రాబోతున్నాయి. మార్చిలో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో అల్లార్డిసే మాతో చర్చించిన అంశాల్ని ప్రస్తావించనున్నారు. అప్పుడు లంక బోర్డుపై విధించిన నిషేధం చర్చకు రానుంది’ అని ఫెర్నాండో తెలిపాడు.
శ్రీలంక క్రీడా మంత్రితో అల్లార్డిసే
నిరుడు నవంబర్లో శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. బోర్డు వ్యవహరాల్లో రాజకీయ జోక్యం మితిమీరడంతో ఆగ్రహించిన ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు షెడ్యూల్ ప్రకారం లంకలో జరగాల్సిన అండర్ -19 ప్రపంచకప్ వేదికను దక్షిణాఫ్రికాకు తరలించింది.
వరల్డ్ కప్లో చెత్త ఆటతో నిరాశపరిచిన శ్రీలంకను భారత జట్టు 302 పరుగుల భారీ ఓడించింది. ఆ ఓటమిని తట్టుకోలేని అభిమానులు, మాజీ ఆటగాళ్లు లంక క్రికెట్ బోర్డు పెద్దలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు బోర్డు సభ్యులందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అప్పటి క్రీడా మంత్రి రోషన్ రణసింఘే(Roshan Ranasinghe) డిమాండ్ చేశాడు. అనంతరం బోర్డు మొత్తాన్ని రద్దు చేసి.. వరల్డ్ కప్ హీరో అర్జున రణతుంగ నేతృత్వంలో మధ్యంతర కమిటీ ఏర్పాటు చేశాడు. దాంతో, అప్పటి లంక బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా(Shammi Silva) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.