Champions Trophy | ఈ ఏడాది పాకిస్థాన్, దుబాయి వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మినీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక టోర్నీ జరిగే మ్యాచుల టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయిస్తారు. పాకిస్థాన్‌లోని వంద అవుట్ లెట్స్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఫిబ్రవరి 19న మొదలై.. మార్చి 9 వరకు కొనసాగుతుంది. చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నది. అయితే, భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరగనున్నది. భవిష్యత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్ల సందర్భంగా తాము భారత్‌కు వెళ్లబోమని.. తటస్థ వేదికల్లోనే మ్యాచులు ఆడుతామని స్పష్టం చేసింది.
దీనికి బీసీసీఐ, పాకిస్థాన్ ఒప్పుకున్నాయి. దాంతో టీమిండియా మ్యాచులన్నీ దుబాయి వేదికగా జరుగనున్నాయి. మిగతా మ్యాచులన్నీ పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి. 1996 తర్వాత పాకిస్థాన్‌లో తొలిసారిగా ఐసీసీ టోర్నీ జరుగుతున్నది. ఇక రెండో సెమీఫైనల్ సహా ఆ దేశంలో జరిగే పది మ్యాచులకు సంబంధించిన టికెట్ల విక్రయాలు మంగళవారం నుంచి మొదలుకానున్నాయి. అయితే, టీమిండియా మ్యాచులకు సంబంధించిన టికెట్లను మాత్రం విక్రయించబోవడం లేదు. త్వరలోనే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. టీమిండియా ఫైనల్‌కు చేరితే.. దుబాయిలోనే ఫైనల్ జరుగుతుంది. లేకపోతే పాక్‌లోనే నిర్వహిస్తారు.